సంగెం: గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను ప్రాధాన్యతా క్రమంలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి కల్పన అన్నారు. మండలంలోని గుంటూరుపల్లి గ్రామపంచాయతీని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా నర్సరీ, డంపింగ్ యార్డు, శ్మశానవాటికలను పరిశీలించారు.అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, పచ్చదనం, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, పన్నుల వసూళ్లు, రికార్డులను తనిఖీ చేశారు. సర్పంచ్ శ్రీకాంత్, ఎంపీఓ హర్షిత్, పంచాయతీ కార్యదర్శి సరిత తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
నర్సంపేట: రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీల్లో నర్సంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 16 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపాల్ మల్లం నవీన్ తెలిపారు. కళాశాలలో గురువారం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే అంశాలను ఎంపిక చేసుకొని క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించారన్నారు. సేకరించిన సమాచారాన్ని శాసీ్త్రయంగా విశ్లేషించి, పరిశోధనాత్మక ప్రాజెక్టులను రూపొందించేందుకు ఎంతో శ్రమించారని తెలిపారు. విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యేందుకు అధ్యాపకుల కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి జిజ్ఞాస ప్రాజెక్టుల ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులను, వారికి మార్గదర్శకత్వం వహించిన గణిత, వాణిజ్య, జంతుశాస్త్రం విభాగాల అధ్యాపకులను జిజ్ఞాస కోఆర్డినేటర్ రుద్రాణి, ప్రాజెక్టు సూపర్‌వైజర్లు రాజీరు, గ్లోరీ తదితరులు అభినందించారు.
కీటక జనిత వ్యాధులను నివారించాలి
కాశిబుగ్గ: కీటక జనిత వ్యాధులను నివారించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి సూచించారు. వరంగల్ దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎంహెచ్‌నగర్‌లో ఇటీవల డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు కీటక జనిత వ్యాధులపై గురువారం స్థానికులకు అవగాహన కల్పించారు. వైద్యాధికారి భరత్‌కుమార్, మాజీ కార్పొరేటర్ సురేశ్‌కుమార్ జోషి, సబ్‌యూనిట్ ఆఫీసర్ కుమార స్వామి, హెచ్‌ఈఓ సదానందం, సూపర్‌వైజర్ మధుకర్, కుమారస్వామి కొర్నేలు, అమృత, అశ్విని పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే
అరూరిపై కేసు
వర్ధన్నపేట: స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారని, జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని మున్సిపల్ కమిషనర్ కృష్ణ ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, పలువురిపై పోలీసులు గురువారం కేసులు నమోదు చేశారు. వర్ధన్నపేట అంబేడ్కర్ సెంటర్‌లో అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించిందుకు, డీజేలు వాడినందుకు మాజీ ఎమ్మెల్యేతోపాటు కౌన్సిలర్లు గుజ్జ వీరన్న, తిరుపతి సురేశ్, సిలివేరు కుమారస్వామి, నాయకులు తూళ్ల కుమారస్వామి, గోధుమల మధుసూదన్, తుమ్మల యాకయ్య, బానోతు నవీన్, భూక్యా రామన్న, లక్ష్మణ్ తదితరులపై కేసులు నమోదయ్యాయి.


