న్యూశాయంపేట: ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ బద్ధంగా అందాల్సిన ఫలాలను అందించడానికి కమిషన్ కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు. కమిషన్ సభ్యులు, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అధికారులతో కలిసి గురువారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. భూ వివాదాలు, అట్రాసిటి కేసుల నమోదు విచారణ, పురోగతి, ప్రభుత్వశాఖల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రోస్టర్ పాయింట్ల పకడ్బందీ అమలుపై చర్చించారు. కేసుల పురోగతిపై పోలీసు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సమీక్షకు సీపీ రాకపోవడంపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు వేగంగా న్యాయం చేయాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల హక్కుల అమలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బాధితులు నేరుగా కమిషన్‌ను సంప్రదించి సమస్యలను తెలపవచ్చని ఆయన చెప్పారు. కేసుల పురోగతిని పరిశీలించి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సమావేశం చివరలో పాల్గొన్న సీపీ శ్వేతకు చైర్మన్ సూచించారు. ప్రతినెల గ్రామస్థాయిలో సివిల్ రైట్స్‌డేను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
బాధితులకు పునరావాసం కల్పించాలి..
బాధిత కుటుంబాలను కేవలం పరిహారంతో వదిలేయకుండా పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అవసరాన్ని బట్టి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు, గృహవసతి కల్పించాలని సూచించారు. దేశంలో రోల్‌మోడల్‌గా తెలంగాణ నిలుస్తోందని తెలిపారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ సివిల్ రైట్స్ డే సందర్భంగా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసేలా అధికారులకు దిశానిర్దేశనం చేస్తామని చెప్పారు. అనంతరం చైర్మన్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కమిషన్ సభ్యులు రేణిగుంట్ల ప్రవీణ్, జిల్లా శంకర్, కొంకటి లక్ష్మీనారాయణ, రాంబాబునాయక్, కుసుమ నీలాదేవితోపాటు డీసీపీ అంకిత్‌కుమార్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
బక్కి వెంకటయ్య


