పలు ప్రాంతాల్లో రోడ్ల పక్కన ప్రమాదకరంగా బావులు
నర్సంపేట–చెన్నారావుపేట ప్రధాన రహదారి పక్కన ప్రమాదకరంగా ఉన్న బావి
చెన్నారావుపేట: రహదారుల వెంట తవ్విన బావులు రైతుల ఉపయోగపడేది ఎంతనో తెలియదు.. కానీ ఆదమరిచిన వారి పాలిట మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. పలు చోట్ల రోడ్ల పక్కన ఉన్న బావులు ప్రమాదకరంగా మారి నరకానికి దగ్గరి దారులు అవుతున్నాయి. అనునిత్యం ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండే చెన్నారావుపేట–నర్సంపేట ప్రధాన రోడ్డు పక్కనే మగ్దుంపురం శివారులో ఉన్న ఓబావి చుట్టు కంచలేదు. కనీసం రక్షణ గోడ కూడా లేకపోవడంతో ప్రమాదకరంగా మారింది. ఆ దారిలో రాత్రి పూట ప్రయాణించే వారికి అవగాహన లేకపోతే ప్రమాదం తప్పకుండా పొంచి ఉంటుంది. పక్కనే ఇంజనీరింగ్ కళాశాల సైతం ఉంది. విద్యార్థులు అవగాహన లేమితో ద్విచక్రవాహనాలు నడుపుతుంటారు. ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులతోపాటు బావి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
బాపునగర్‌లో ఒకటి..
మండల పరిధిలోని శంకరమ్మతండా సమీపంలో ఉన్న బాపునగర్ గ్రామానికి వెళ్లే దారిలో సైతం ఓ వ్యవసాయ బావి రోడ్డుకు రెండు మీటర్ల దూరంలోనే ఉంది. బావికి రోడ్డు నడుమ ఖాళీ స్థలంలో ఆ రైతు పత్తి పంట సాగు చేశాడు. దీంతో అక్కడ బావి ఉందన్న విషయం తెలియకుండా పోతోంది. ట్రాక్టర్ లాంటి వాహనాలు రోడ్డు దించితే బావిలోకి జారే పరిస్థితి ఉంటుంది. నిత్యం రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు ఈ దారివెంట ప్రయాణిస్తూ ఉంటారు. రోడ్డు వెంట ఎలాంటి విద్యుత్ దీపాలు సైతం ఉండవు. పశువులు, ట్రాక్టర్లు ఒకేసారి వస్తే ఎవరు ఎటు వెళ్లాలో తెలియని ప్రమాదకర పరిస్థితి. ఈ బావి వద్ద సైతం కంచె ఏర్పాటు చేయాలని తండావాసులు కోరుతున్నారు.
కనిపించని రక్షణ గోడలు,
హెచ్చరిక బోర్డులు
బాటసారులు, వాహనదారులకు
తప్పని ఇబ్బందులు
బావికి కంచె ఏర్పాటు చేయాలి
నా వ్యవసాయ బావి ఇదివరకు రోడ్డుకు దూరంగా ఉండేది. రోడ్డు వెడల్పు చేయడం వల్ల రోడ్డుకు దగ్గరగా అయింది. దీంతో ప్రమాదకరంగా మారింది. బాటసారులు, వాహనదారులకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దుస్థితి నెలకొంది. కంచె నిర్మాణం కోసం అధికారులకు విన్నవించాం. రోడ్డు పనులు పూర్తి అయితేనే బావికి సైడ్‌వాల్ నిర్మిస్తామని చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సైడ్‌వాల్ నిర్మించాలి.
– ధరావత్ లక్ష్మణ్, శంకరంతండా


