ఇక అరచేతిలో రాగన్నగూడెం | - | Sakshi
Sakshi News home page

ఇక అరచేతిలో రాగన్నగూడెం

Aug 21 2026 7:39 AM | Updated on Aug 21 2026 7:39 AM

సాక్షి, వరంగల్‌: పల్లె పాలనలో సాంకేతికతకు పెద్దపీట వేస్తూ రాగన్నగూడెం గ్రామ పంచాయతీ డిజిటల్‌ బాట పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘రైజింగ్‌ తెలంగాణ–2047’ ప్రణాళికలో భాగంగా 31 జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా జిల్లా నుంచి రాయపర్తి మండలం రాగన్నగూడేనికి అవకాశం దక్కింది. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీశాప్‌)లో భాగంగా రాగన్నగూడెం గ్రామ పంచాయతీకి ప్రత్యేక వెబ్‌సైట్‌ సిద్ధమైంది. దీంతో గ్రామానికి సంబంధించిన కీలక సమాచారం స్మార్ట్‌ఫోన్‌లోనే తెలుసుకునే అవకాశం కలగనుంది. హైదరాబాద్‌లోని టీజీఐఆర్‌డీలో శుక్రవారం 31 పంచాయతీల వెబ్‌సైట్ల ప్రారంభోత్సవంలో జిల్లా నుంచి డీపీఓ కల్పన, ఎంపీడీఓ టి. శ్రీనివాస్‌, సర్పంచ్‌ ఆకుల శోభ పాల్గొననున్నారు.

443 జనాభా.. 171 కుటుంబాలు

రాగన్నగూడెం గ్రామంలో 443 మంది జనాభాతో పాటు 171 కుటుంబాలు, 128 ఇళ్లు ఉన్నాయి. వీటితో పాటు పంచాయతీ కోడ్‌, భౌగోళిక విస్తీర్ణం వంటి ప్రాథమిక వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. సర్పంచ్‌, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ వివరాలతో పాటు పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది సంప్రదింపు నంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

అందుబాటులో సమాచారం..

గ్రామంలోని రోడ్లు, నల్లా కనెక్షన్లు, బోర్లు, వీధిదీపాలు, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, రేషన్‌కార్డు లబ్ధిదారుల వివరాలు, సామాజిక భద్రత పింఛన్‌దారులు, మహిళా స్వయం సహాయక సంఘాల సమాచారం ఉండనుంది. అభివృద్ధికి సంబంధించిన మూడేళ్ల ప్రణాళిక, వార్షిక బడ్జెట్‌, చేపట్టిన పనులు, కొనసాగుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్‌ కార్యక్రమాలను సైతం ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. విదేశాలు, ఇతర నగరాల్లో ఉన్న రాగన్నగూడెం వాసులు తమ ఊరి ప్రగతిని తెలుసుకునే అవకాశం కలగనుంది. కంప్యూటర్లు, ఆప్టికల్‌ ఫైబర్‌ ఇంటర్నెట్‌ సదుపాయాలతో డిజిటల్‌గా ముస్తాబైన రాగన్నగూడెం.. పల్లె పాలనలో జిల్లాకు ఆదర్శంగా నిలిచే దిశగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీలకు వెబ్‌సైట్లను మూడు దశల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలిదశలో జిల్లాకు ఒకటి చొప్పున 31 గ్రామాల్లో ప్రారంభిస్తున్నారు. రెండో దశలో ఈ నెలాఖరుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున విస్తరించనున్నారు. సెప్టెంబర్‌ చివరి నాటికి అన్ని పంచాయతీల వెబ్‌సైట్లు అందుబాటులోకి రానున్నాయి.

నేడు హైదరాబాద్‌లో

వెబ్‌సైట్‌ ప్రారంభం

గ్రామ అభివృద్ధి పనులు తెలుసుకునే అవకాశం

సమస్త సమాచారంతో

ప్రజల్లో ఆనందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement