నల్లబెల్లి: నూనె మిల్లులో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ కుడిచేయిని కోల్పోయింది. స్థానికుల కథనం ప్రకారం.. రంగాపురం గ్రామానికి చెందిన కందగట్ల కవిత భర్త శివరాం 10 ఏళ్ల క్రితమే జ్వరంతో మృతి చెందాడు. దీంతో ఇద్దరు పిల్లలతో నివసిస్తోంది. వీఓఏగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించడంతో పాటు పిల్లలను బీటెక్ వరకు చదివించింది.
వేరుశనగ నూనె కోసం వెళ్లి..
వేరుశనగలతో నూనె పట్టించుకునేందుకు కవిత బుధవారం నల్లబెల్లి మండల కేంద్రంలోని నగేశ్ నూనె మిల్లుకు వెళ్లింది. మిల్లు నిర్వాహకురాలు జక్కుల శిరీష పల్లీలు పడుతుండగా కవిత పిండిని డబ్బాలో సేకరిస్తోంది. ఈ సమయంలో నీళ్ల క్యాన్ తీసుకురావడానికి నిర్వాహకురాలు ఇంటి ముందుకు వెళ్లింది. అదే సమయంలో పిండి సేకరిస్తున్న కవిత చేయి ప్రమాదవశాత్తు మిల్లు చక్రాల్లో పడింది. ప్రమాదాన్ని గుర్తించిన శిరీష వెంటనే మిల్లును ఆఫ్ చేసింది. కానీ, అప్పటికే కవిత కుడిచేయి జబ్బ వరకు కోల్పోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కవితను కుటుంబ సభ్యులు చికిత్స కోసం హనుమకొండలోని ఓ పైవేట్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ పిల్లల భవిష్యత్ కోసం శ్రమించిన కవితకు ప్రమాదంతో జరగడంతో స్థానికులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. విష యం తెలుసుకున్న ఎస్సై సాయిప్రసన్న కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
కుడిచేయి కోల్పోయిన మహిళ
నల్లబెల్లి మండల కేంద్రంలో ఘటన


