● జిల్లా ప్రధాన న్యాయమూర్తి
వీబీ నిర్మలాగీతాంబ
వరంగల్ లీగల్: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 12 (శనివారం)న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలా గీతాంబ పిలుపునిచ్చారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయవాధికార భవన్‌లో బుధవారం నిర్వహించిన పోలీసు అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజీ పడదగిన కేసులను జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత మాట్లాడుతూ పోలీస్ శాఖ పరిధిలోని రాజీకి అనుకూలమైన కేసులను గుర్తించి, సంబంధిత కక్షిదారులకు జాతీయ లోక్ అదాలత్ ప్రయోజనాలు వివరించాలని పోలీసు అధికారులకు సూచించారు. వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్. ఉపేందర్, బార్ కౌన్సిల్ సభ్యులు ఎం.సహోదర్‌రెడ్డి, జిల్లా న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.


