నర్సంపేట: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి తర్వాత నర్సంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్వల్ప ఉద్రిక్తతల మధ్య బుధవారం నర్సంపేటలో బంద్ విజయవంతమైంది. జిల్లా ఆస్పత్రి ఎదుట బీఆర్‌ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయగా.. అనుమతులు లేవనే కారణంతో అధికారులు మంగళవారం తొలగించారు. దీంతో నర్సంపేట బంద్‌కు బీఆర్‌ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. బంద్ సందర్భంగా బస్సులు సాయంత్రం 4 గంటల తర్వాత డిపో నుంచి బయటకు వచ్చాయి. పెట్రోల్ బంకులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకోలేదు. ఆరు మండలాల నుంచి బీఆర్‌ఎస్ నేతలు నర్సంపేటకు వచ్చి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ది విగ్రహం తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బస్టాండ్ ఎదుట పోలీసులు బీఆర్‌ఎస్ నాయకులను తరలించేందుకు ప్రయత్నించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇద్దరు సీఐలు వీఆర్‌కు అటాచ్..
పెద్ది విగ్రహం ఏర్పాటు చేసిన సంఘటనలో ఇద్దరు సీఐల నిర్లక్ష్యం ఉందని వారిని అధికారులు వీఆర్‌కు అటాచ్ చేసినట్లు తెలిసింది. నర్సంపేట సీఐ ముస్కు శ్రీనివాస్ సెలవులో ఉండగా.. విధులు నిర్వర్తించిన రూరల్ సీఐ సాయిరమణ, నెక్కొండ సీఐ శ్రీనివాస్‌ను అటాచ్ చేశారు. వీరి స్థానంలో జె.శంకర్‌రావును నర్సంపేట రూరల్ సీఐగా, ఫణిందర్‌ను నెక్కొండ సీఐగా బదిలీ చేశారు.


