రూ.66.36 కోట్ల ధాన్యం మాయం! | - | Sakshi
Sakshi News home page

రూ.66.36 కోట్ల ధాన్యం మాయం!

Aug 15 2026 7:35 AM | Updated on Aug 15 2026 7:35 AM

రూ.66.36 కోట్ల ధాన్యం మాయం!

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) బకాయిల వ్యవహారం ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీఎంఆర్‌ బియ్యం /ధాన్యం లెక్కల్లో భారీగా తేడాలు బయటపడుతున్నాయి. విజిలెన్స్‌, సివిల్‌ సప్లయీస్‌ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 25,689.522 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.66.36 కోట్లుగా తేలింది. సీఎంఆర్‌ బకాయిల వసూళ్లపై ప్రభుత్వం దృష్టి సారించడంతో అధికారులు తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. 20 రోజుల్లో 16 రైస్‌మిల్లులను తనిఖీ చేయగా.. పలు మిల్లుల్లో ధాన్యం లేనట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఆరు మిల్లులపై కేసులు నమోదు చేసి, స్వల్ప తేడా ఉన్న మిల్లర్లకు నోటీసులు ఇచ్చారు. ఉమ్మడి వరంగల్‌లో మొత్తం సీఎంఆర్‌ బకాయి రూ.230 కోట్ల వరకు ఉండగా, వాటి వసూళ్ల కోసం దాడులు, తనిఖీలు కొనసాగుతున్నాయి.

పక్కదారి పట్టిన సీఎంఆర్‌.. ఎక్కడెక్కడ ఎంత?

తనిఖీల్లో బయటపడిన మొత్తం కొరత 25,689.522 టన్నులు కాగా, ఆరుగురు మిల్లర్లపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, ఆయా మిల్లులపై అధికారులు, పోలీసులు చర్యలు చేపట్టారు. కొన్ని మిల్లులకు సంబంధించిన వ్యక్తులు అందుబాటులో లేకపోవడంలో నోటీసులు జారీ చేశామని, మరికొన్ని కేసుల్లో తదుపరి చర్యలు కొనసాగుతాయని అధికారులు చెప్పారు.

● హనుమకొండ జిల్లాలో మూడు మిల్లుల్లో 6,853.306 టన్నుల ధాన్యం కొరతగా, దాని విలువ రూ.17.27 కోట్లుగా నమోదైంది. గట్లకానిపర్తిలో మెస్సర్స్‌ లక్ష్మీ నర్సింహ ఇండస్ట్రీస్‌, మెస్సర్స్‌ శ్రీవినాయక ఇండస్ట్రీస్‌లపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

● వరంగల్‌లో రెండు మిల్లుల్లో 2,285.232 టన్నుల ధాన్యం మాయం కాగా, దాని విలువ రూ.5.20 కోట్లుగా అధికారులు గుర్తించారు. నర్సంపేటలోని సుగుణ ఇండస్ట్రీస్‌పై కేసు నమోదైంది.

● జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని రెండు మిల్లుల్లో 3,007.244 టన్నుల ధాన్యం కొరతగా ఉండగా, వాటి విలువ రూ.7.88 కోట్లుగా తేలింది. రూ.4.39 కోట్లు బకాయి ఉన్న గిద్దెముత్తారంలోని వైష్ణవి ఇండస్ట్రీస్‌ మిల్లుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

● ములుగులో రెండు మిల్లుల్లో తనిఖీ చేయగా, 1,574.217 టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. ఆ ధాన్యం విలువ రూ.3.59 కోట్లుగా నమోదైంది.

● మహబూబాబాద్‌ జిల్లాలో నాలుగు మిల్లుల్లో 1,103.250 టన్నుల ధాన్యం లేకపోగా, వాటి విలువ రూ.3.08 కోట్లుగా తేలింది. కేసముద్రంలోని బాలాజీ ఆగ్రో ఇండస్ట్రీ, తిరుమల బిన్నీ రైసుమిల్లులపై కేసులు పెట్టగా, ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

● జనగామ జిల్లా బచ్చన్నపేట శ్రీమిత్ర అగ్రో ఇండస్ట్రీస్‌, జఫర్‌గడ్‌ మండలం తిమ్మంపేటలోని పీఎస్‌కే ఆగ్రో ఇండస్ట్రీస్‌లలో విజిలెన్స్‌, సివిల్‌సప్లయ్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ రెండు మిల్లుల్లో రూ.2.29 కోట్ల విలువైన 833.206 టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. తదుపరి చర్యలకు పౌరసరఫరాలశాఖను ఆదేశించారు.

పాత బకాయిలపై నజర్‌

తనిఖీల్లో బయటపడిన కొరతలో కొంతభాగం 2022–23 ధాన్యానికి సంబంధించిన పాత బకాయిలపై కూడా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నజర్‌ పెట్టారు. అలాంటి మిల్లులపై సంబంధిత జిల్లా పౌరసరఫరాల అధికారులకు తదుపరి చర్యల కోసం రిక్విజిషన్లు పంపినట్లు సమాచారం. కాగా, సీఎంఆర్‌ కోసం ప్రభుత్వ ధాన్యాన్ని తీసుకున్న మిల్లుల్లో నిల్వలు, మిల్లింగ్‌ అనంతరం ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం, మిల్లుల్లో అందుబాటులో ఉన్న ధాన్యం తదితర లెక్కలను అంచనా వేసి బకాయిలు రాబట్టడంపై దృష్టి పెడుతున్నారు. ఇదిలా ఉండగా, సీఎంఆర్‌ బకాయిలపై సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన సమీక్ష అనంతరం విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల మరింత దూకుడు పెంచారు. పౌరసరఫరాలశాఖ సమన్వయంతో బకాయిదారుల రైసుమిల్లుల్లో తనిఖీలు నిర్వహించి ధాన్యం గుట్టు విప్పుతున్నారు. సీఎంఆర్‌ చెల్లించక, ధాన్యం నిల్వ చూపని మిల్లర్లను గుర్తించి కేసులు పెడుతున్నారు. అందుబాటులో లేని డిఫాల్టర్లకు నోటీసులు జారీ చేస్తుండగా.. అందుబాటులో ఉన్న మిల్లర్లపై కేసులు, బకాయిల వసూలుకు చర్యలు చేపడుతున్నారు. దీంతో సీఎంఆర్‌ బకాయిల వ్యవహారంలో ఇక నుంచి మరింత కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు అధికార వర్గాలనుంచి వెలువడుతున్నాయి.

‘విజిలెన్స్‌–సివిల్‌ సప్లయీస్‌’

తనిఖీల్లో బట్టబయలు

సీఎంఆర్‌ ఎగవేతపై కేసుల కొరడా... ఆరుగురు మిల్లర్లపై ఎఫ్‌ఐఆర్‌లు..

స్వల్ప తేడా ఉన్నవారికి నోటీసులు..

25,690 టన్నుల ధాన్యం కొరత... కొనసాగుతున్న తనిఖీలు

సీఎం సమీక్ష తర్వాత మరింత

దూకుడు పెంచిన అధికారులు

రైస్‌ మిల్లర్‌ అరెస్ట్‌

వేలేరు: సీఎంఆర్‌ ధాన్యం దుర్వినియోగం చేసిన కేసులో మండలంలోని మల్లికుదుర్ల గ్రామానికి చెందిన రాజరాజేశ్వర రైస్‌మిల్లర్‌ యాజమాని మండల అరుణ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసినట్లు కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 2023–24 ఖరీఫ్‌ సీజన్‌లో ప్రభుత్వం 1,585,040 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కేటాయించింది. అందుకు అనుగుణంగా సదరు మిల్లర్‌ అరుణ్‌కుమార్‌ 1,061,976 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 602.111 మెట్రిక్‌ టన్నుల ధాన్నాన్ని మాత్రమే అందజేశారు. మిగతా 459.865 మెట్రిక్‌ టన్నుల బకాయి ఉంది. దీంతో జిల్లా సివిల్‌ సప్లయీస్‌ డిప్యూటీ తహసీల్దార్‌ ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో రైస్‌ మిల్లులో ప్రభుత్వ ధాన్యం నిల్వలు అందుబాటులో లేవని గుర్తించి రైస్‌ మిల్లులో ధాన్యం లేదని ఆయన ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. బకాయి విలువ 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీ కలిపి మొత్తం రూ.2,42,02,477 ఉన్నట్లు అధికారులు గుర్తించి పోలీస్‌ స్టేషన్‌లో అరుణ్‌కుమార్‌పై పిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మండల అరుణ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసి చట్టపరమైన చర్యల నిమిత్తం కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో వేలేరు ఎస్సై అజ్మీర సురేశ్‌, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement