ఉత్సాహంగా టెన్నిస్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా టెన్నిస్‌ పోటీలు

Aug 15 2026 7:29 AM | Updated on Aug 15 2026 7:29 AM

ఉత్సాహంగా టెన్నిస్‌ పోటీలు నేడు కాకతీయ మ్యూజికల్‌ గార్డెన్‌ రీ ఓపెన్‌ ఆవగింజపై త్రివర్ణ పతాకం హెచ్‌ఐవీ నివారణపై ప్రత్యేక దృష్టి ఫోన్‌కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలి

వరంగల్‌ స్పోర్ట్స్‌: హనుమకొండ జిల్లా టెన్నిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండ జేఎన్‌ స్టేడియంలో ఒక్క రోజు ఇంటర్నల్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. 60 ప్లస్‌ కేటగిరీలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ డాక్టర్‌ ఎర్రగట్టు స్వామి–కె.రవిచంద్ర, కుంజ్‌ బిహారి–పి.వెంకటేశ్వరరావు మధ్య పోటీ ఉత్కంఠగా సాగింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఎర్రగట్టు స్వామి, రవిచంద్ర జట్టు విజేతగా నిలిచింది. ఓపెన్‌ కేటగిరీ డబుల్స్‌ విభాగంలో వినీల్‌కుమార్‌, శ్రీనివాస్‌ జట్టు విజేతగా నిలవగా, ద్వితీయ స్థానంలో ప్రదీప్త, కార్తికేయ జట్టు ట్రోఫీని అందుకుంది. సింగిల్స్‌ విభాగంలో ప్రథమ స్థానంలో టి.సాత్విక్‌, ద్వితీయ స్థానంలో వినీల్‌కుమార్‌ విజేతలుగా నిలిచారు. ముగింపు పోటీలకు ముఖ్య అతిథులుగా అసోసియేషన్‌ ప్యాట్రన్‌ శ్రీనివాసరావు, డీవైఎస్‌ఓ ప్రశాంత్‌ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ టెన్నిస్‌ క్రీడాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు.

నయీంనగర్‌: కాకతీయ మ్యూజికల్‌ గార్డెన్‌ను నేడు (శనివారం) నుంచి ప్రజలు సందర్శించడానికి అందుబాటులోకి తీసుకొచ్చామని హనుమకొండ కలెక్టర్‌, ‘కుడా’ వైస్‌ చైర్మన్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. ప్రతీరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు వాకర్లు, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 వరకు సాధారణ సందర్శకులు గార్డెన్‌ను సందర్శించవచ్చని పేర్కొన్నారు. గార్డెన్‌ నిర్వహణ, సౌకార్యాల పరిరక్షణ కోసం సందర్శకుల నుంచి కనీస రుసుము వసూలు చేస్తారని తెలిపారు. రోజూ సాయంత్రం 7:30 గంటలకు మల్టీమీడియా షో (మ్యూజికల్‌ షో) ఉంటుందని తెలిపారు. ఈగార్డెన్‌.. సందర్శకులకు వినోదంతో పాటు ఆహ్లాదకర వాతావరణం అందించనున్నట్లు, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

కాశిబుగ్గ: కాశిబుగ్గలోని సాయి గణేశ్‌ కాలనీకి చెందిన మైక్రో ఆర్టిస్ట్‌ కుసుమ లింగమూర్తి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆవగింజపై జాతీయ పతాకం చిత్రించి ఆకట్టుకున్నారు. కాగా, సూక్ష్మ కళలో ఆయన ప్రతిభను గుర్తించిన పలు సంస్థలు గతంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో అవార్డులు అందించాయి.

హన్మకొండ అర్బన్‌: హెచ్‌ఐవీ పాజిటివ్‌గా గుర్తించిన ప్రతీ కేసును తప్పనిసరిగా నమోదు చేసి, బాధితులకు ఏఆర్టీ, కౌన్సెలింగ్‌, వైద్య సేవలు నిరంతరం అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్‌, హనుమకొండ డీఎంహెచ్‌ఓలు బి.రాజారెడ్డి, అప్పయ్య సూచించారు. శుక్రవారం వరంగల్‌ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా పరిధిలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నివారణ, నియంత్రణ కార్యక్రమాలపై సమీక్షించారు. సమావేశంలో నోడల్‌, కార్యక్రమ అధికారి మదన్‌మోహన్‌, వరంగల్‌ కార్యక్రమ అధికారి అరుణ్‌జోషి, జిల్లా కార్యక్రమ నిర్వాహకురాలు స్వప్న మాధురి, డేటా మేనేజర్‌ కమలాకర్‌, ఏఆర్టీ వైద్యాధికారులు, ఐసీటీసీ కౌన్సెలర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లా ఎయిడ్స్‌ నివారణ, సిబ్బంది పాల్గొన్నారు.

హన్మకొండ: విద్యుత్‌ వినియోగదారులు అపరిచితులనుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని టీజీఎన్పీడీసీఎల్‌ హనుమకొండ టౌన్‌ డీఈ జి.సాంబరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘మేం ఎలక్ట్రిసిటీ వాళ్లమని, మీ మీటర్‌ ఆగిపోయింది.. కాలిపోయింది.. బకాయి ఉంది’ అని కాల్‌ చేస్తే స్పందించవద్దని పేర్కొన్నారు. ఇలాంటి వారికి నేరుగా డబ్బులు ఇవ్వొద్దని, డిజిటల్‌ పేమెంట్‌ చేయొద్దని సూచించారు. ప్రధానంగా 94945 75271 నంబర్‌తో వచ్చే ఫోన్‌ కాల్‌ను నమ్మొద్దని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement