● కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్,
వరంగల్ సీపీ శ్వేత
● పరకాల బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
పరకాల: ఈనెల 16న సీఎం ఏనుముల రేవంత్‌రెడ్డి పరకాలలో పర్యటించనున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తెకుండా పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ సీపీ శ్వేత అధికారులను ఆదేశించారు. శుక్రవారం పరకాలలోని బహిరంగ సభా ప్రాంగణాన్ని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, సీపీ శ్వేత, ఐఎస్‌డబ్ల్యూ ఎస్పీ బాషాతో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలించారు. సీఎం పర్యట ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సభకు తరలివచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, విద్యుత్, పార్కింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ వారికి కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. సభా వేదిక పరిశీలనలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న, డీసీపీ అంకిత్, జిల్లా అఽధికారులు, రెవెన్యూ, ఇంజనీరింగ్, మున్సిపల్, పోలీస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


