న్యూస్‌రీల్
బిడ్డకు ఎంతో మేలు..
వయస్సు వారీగా పాలు, పౌష్టికాహారం
కొనసాగుతున్న ‘తల్లిపాల వారోత్సవాలు’
● శిశువుకు ఆరు నెలల వరకు నీళ్లు కూడా తాగించొద్దు
● జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ
అధికారి అప్పయ్య
హన్మకొండ అర్బన్: జన్మించిన ప్రతీ శిశువుకు తల్లి పాలే సంజీవని అని, అవి ప్రకృతి ప్రసాదించిన తొలి రక్షణ కవచమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అప్పయ్య అన్నారు. శనివారం నుంచి మొదలైన ‘ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు’ 7వ తేదీ వరకు కొనసాగుతాయని ఆయన తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తల ద్వారా ప్రతి కుటుంబంలో తల్లిపాల ప్రాముఖ్యంపై అవగాహన పెంపొందించడమే ఈ వారోత్సవాల ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.
ముర్రుపాలు అమృతంతో సమానం!
ప్రసవించిన వెంటనే బిడ్డకు తొలి గంటలోనే తల్లిపాలు పట్టించడం అత్యంత ఆవశ్యకం. కాన్పు అయిన మొదటి కొద్ది రోజులు వచ్చే చిక్కటి పసుపు రంగు పాలను ‘ముర్రుపాలు’ (కొలస్ట్రమ్) అంటారు. ఇవి బిడ్డకు అమృతంతో సమానం. వీటిలో ప్రోటీన్లు, విటమిన్ ‘ఎ’, ‘బి’, పాటు సహజ రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయి. ఇవి బిడ్డకు మొదటి టీకాగా పనిచేసి, జీర్ణశక్తిని పెంచడంతో పాటు కామెర్లు, విరేచనాలు, న్యుమోనియా వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
తల్లులకు కలిగే ఆరోగ్యం
తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి–శిశువు మధ్య అను బంధం మరింత బలపడుతుంది. ప్రసవానంతరం తల్లి త్వరగా కోలుకోవడమే కాక, నెలసరి రక్తస్రావం తక్కువగా ఉంటుంది. పాలిచ్చినంత కాలం ఇది సహజ గర్భ నిరోధకంగా పనిచేస్తుంది. భవిష్యత్‌లో రొమ్ము, అండాశయ (ఓవరీ) క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
తల్లులు సమతుల్య పోషకాహారం తీసుకోవాలి. తగినంత నీరు తాగుతూ పరిశుభ్రత పాటించాలి. తల్లిపాలపై ఎలాంటి సందేహాలు ఉన్నా సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు లేదా ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలను సంప్రదించాలి. ప్రతీ బిడ్డకు ఆరోగ్యవంతమైన భవిష్యత్‌ను అందించేందుకు కుటుంబ సభ్యులు, సమాజం తల్లులకు సహకరించాలి. – డాక్టర్ అప్పయ్య, డీఎంహెచ్‌ఓ
●
బలానికి, తెలివితేటలకు మూలం: సీసా పాలు తాగే పిల్లల కంటే తల్లిపాలు తాగే పిల్లలు శారీరకంగా బలంగా, తెలివిగా ఉంటారు.
వ్యాధుల నుంచి రక్షణ: శ్వాసకోశ వ్యాధులు, అలర్జీలు, ఆస్తమా, చర్మ వ్యాధుల నుంచి ఇవి రక్షణ కల్పిస్తాయి. పాలు తాగడం వల్ల బిడ్డ దవడలు బాగా బలపడతాయి.
సులభ జీర్ణం: ఎలాంటి క్రిములు లేని అత్యంత ,సురక్షితమైన తేలికగా అరిగే పరిశుభ్రమైన ఆహారం తల్లిపాలే.
బిడ్డ పుట్టిన మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఈ సమయంలో నీరు, తేనె, గ్లూకోజ్, డబ్బా పాలు పొరపాటున కూడా ఇవ్వకూడదు. వగలు, రాత్రి కలిపి రోజుకు కనీసం 8 నుంచి 10 సార్లు పాలివ్వాలి.
7 నుంచి 8 నెలలు తల్లిపాలతో పాటు రోజుకు 3 సార్లు పైఆహారం (పౌష్టికాహారం) ప్రారంభించాలి.
9 నుంచి 11 నెలలు తల్లిపాలతో పాటు రోజుకు 4 సార్లు పై ఆహారం అందించాలి. ఈ క్రమాన్ని రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగించాలి.
పాలు పట్టే సరైన పద్ధతి
బిడ్డ తల, శరీరం అడ్డంగా ఉండేలా తల్లి ఒడిలో పూర్తి ఆసరా (సపోర్ట్) ఇస్తూ పట్టుకోవాలి.
బిడ్డ తల స్తనం వైపు, ముక్కు చనుమొన వైపు ఉండేలా ఉంచాలి.
బిడ్డ నోరు పూర్తిగా తెరవగానే చనుమొనతో పాటు దాని చుట్టూ ఉండే నల్లటి భాగం (క్రింది పెదవి సహా) నోట్లోకి వెళ్లేలా అందించాలి.
రెండు వైపులా మార్చి పాలు పట్టాలి. ఒకవైపు పాలు పూర్తిగా తాగడానికి దాదాపు 20 నిమిషాల సమయం పడుతుంది.


