హన్మకొండ: యువజనాభివృద్ధికి మేరా యువ భారత్ దోహదం చేస్తుందని వరంగల్ జిల్లా యువజన అధికార భూక్యా సంజీవ్ అన్నారు. హనుమకొండ నయీంనగర్‌లోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాలలో భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ వరంగల్ సంస్థ నేతృత్వంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ దేశ యువత కోసం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ జాతీయ డిజిటల్ వేదికను ప్రారంభించిందన్నారు. 15 నుంచి 29 ఏళ్ల వయస్సు వారికి వలంటీర్ అవకాశాలు, నాయకత్వ శిక్షణ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ వేదిక దోహదపడుతుందని వివరించారు. వాగ్దేవి కళాశాల ప్రిన్సిపాల్ శేషాచలం మాట్లాడుతూ యువతకు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం మాదకద్రవ్యాల రహిత భారత నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.
వరంగల్ జిల్లా యువజన అధికారి భూక్యా సంజీవ్


