రామన్నపేట/హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిగా డాక్టర్ ఏ.అప్పయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల సాధారణ బదిలీల్లో భాగంగా.. ములుగు ప్రభుత్వ ఆస్పత్రి ఆర్‌ఎంఓగా బదిలీ అయిన ఆయనను హనుమకొండ డీఎంహెచ్‌ఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా వారు ఆయనకు సూచించారు.
హన్మకొండ అర్బన్: భద్రకాళి మాడవీధుల అభివృద్ధి పనుల కారణంగా ప్రభావితమైన కుటుంబాల జీవనోపాధికి భరోసా కల్పించేందుకు అర్హులైన 30 మందికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ నియామక పత్రాలను శుక్రవారం పంపిణీ చేశారు. కలెక్టరేట్‌లో జరిగిన ఈకార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ లబ్ధిదారులకు నియామక పత్రాలు అందించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల వల్ల ప్రభావితమైన కుటుంబాలకు సంక్షేమ, గృహ, ఉపాధి పథకాల ప్రయోజనాలు కూడా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఓ అజిత్ రెడ్డి, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లోని మేథమెటిక్స్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ‘సైంటిఫిక్ కంప్యూటింగ్ అండ్ విజువలైజేషన్’ అంశంపై మూడు రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌ను నిట్‌లోని రామన్‌హాల్‌లో అట్టహాసంగా ప్రారంభించారు. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఇండీస్, సెయింట్ ఆగస్టీన్ ప్రొఫెసర్, హెడ్ శ్రీధరరావు గునకాల ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించి, కాన్ఫరెన్స్ సావనీర్‌ను విడుదల చేశారు. కాన్ఫరెన్స్‌లో భాగంగా శుక్రవారం ఉద్యోగ విరమణ పొందిన నిట్ ప్రొఫెసర్లు కేఎన్‌ఎస్, కాశీవిశ్వనాథన్, జేవీ.రమణమూర్తిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ పీవీఎస్‌ఎన్ మూర్తి, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ వైవీఎస్‌ఎస్.సన్యాసిరాజు, నిట్ ఇన్‌చార్జ్ డైరెక్టర్, ప్రొఫెసర్ ఎన్వీ.ఉమామహేశ్, సీహెచ్.రామ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో 9, పదోతరగతి చదువుతున్న బీసీ, ఈబీసీ డే స్కాలర్ విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి లక్ష్మణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన డే స్కాలర్ విద్యార్థులకు ఏడాదికి రూ.4 వేలు ఉపకార వేతనం అందుతుందని, ఆన్‌లైన్‌లో ఈ–పాస్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధికి..
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే నిరుపేద ఎస్సీ విద్యార్థులు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ డెవలప్‌మెంట్ డీడీ బి.నిర్మల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్ కొరియా దేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు రూ.20 లక్షల స్కాలర్‌షిప్, వీసా ఫీ, విమాన ప్రయాణ చార్జీలు అందించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఆగష్టు 31లోపు telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.


