న్యూశాయంపేట: ప్రత్యేక సమగ్ర ఓటరు జా బితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత గడువులో గా పూర్తి చేయాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ డాక్టర్ పవన్‌కుమార్ శర్మ ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవా రం న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు. ప్రతీ బీఎల్‌ఓ రోజుకు కనీసం 15 శాతం డిజిటలైజేషన్ లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ. గణేశ్, ఆర్డీఓలు సుమా, ఉమారాణి, ఎన్నికల సూపరింటెండెంట్ రజనీ, అధికారులు పాల్గొన్నారు.
సైబర్ మోసం..
సంగెం : సంగెం మండలం లోహిత పెద్దతండాకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి గుగులోతు వెంకటేశ్ బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 94,947 లను డ్రా చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. వెంకటేశ్ మొబైల్‌కు పలు మార్లు ఓటీపీ వచ్చింది. దీంతో బాధితుడు ఫోన్‌పే ఓపెన్ చేసి చూడగా అతడి అకౌంట్‌లోని డబ్బులు పలుమార్లు కట్ అయ్యాయి. ఈ విషయమై బ్యాంకు వద్దకు వెళ్లి వివరాలు తీసుకున్నాడు. అనంతరం శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
కాళోజీ సెంటర్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీఎస్‌సీపీఎస్‌ఈయూ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొంపెల్లి రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని శంభునిపేట ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని నిరసిస్తూ ఈనెల 11న భద్రాద్రి జిల్లాలో మొదలు కానున్న జన జాగరణ యాత్ర వాల్ పోస్టర్ ఆవిషరించారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 11 నుంచి 30వ తేదీ వరకు జరిగే ర్యాలీ ఈ నెల 29న వరంగల్ జిల్లాకు చేరుకుంటుందని, ర్యాలీలో జిల్లాలోని ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ రఘు, జిల్లా కార్యవర్గ సభ్యులు వివేకానంద, శ్రీనివాస్, రాజ్‌కుమార్, రఘు, నవీన్ దేవరాజ్, అశోక్ పాల్గొన్నారు.
ప్రతిపాదనలు సిద్ధం చేయండి
వరంగల్ అర్బన్: జంతు వధశాలల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని బల్దియా కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాజీపేట, హనుమకొండలోని జంతు వధశాలలను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆదేశాలిచ్చారు. హనుమకొండ ప్రెస్ క్లబ్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టు పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరంగల్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. అనంతరం నక్కలగుట్ట వార్డు కార్యాయాలన్ని తనిఖీ చేశా రు. అనంతరం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో శానిటరీ ఇన్‌న్‌స్పెక్టర్లు, అర్బన్ మలేరియా విభాగ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎస్‌ఈ రాజ్‌కుమార్, సీఎంహెచ్‌ఓ డా.రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, శానిటరీ సూపర్‌వైజర్లు భాస్కర్, నరేందర్, గోల్కొండ శ్రీను, హెల్త్ ఇన్‌స్పెక్టర్ మధుకర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. అభ్యుదయ సేవా సమితి , స్వచ్ఛ వరంగల్ పౌర సంఘాల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్‌లో సెప్టిక్ ట్యాంకుల క్రమబద్ధమైన డిస్లడ్జింగ్‌పై అవగాహన పోస్టర్లను కమిషనర్ టి.వెంకన్న ఆవిష్కరించారు.


