వేలేరు: వేలేరు మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువులు, కుంటల్లో నీళ్లు లేక, ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవక ఇంకా పొలాలు దున్నలేదు. అలాగే నాటేందుకు సిద్ధం చేసిన వరినారు రోజురోజుకూ ముదిరిపోతోంది. ఎక్కువ రోజులు నారు ముదిరి పోతే దిగుబడి కూడా తగ్గుతుంది. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికై నా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సంబంధిత అధికారులు స్పందించి త్వరగా గండి రామారం లిఫ్ట్ పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. – ఆవునూరి శ్యాం, రైతు, పీచర
పత్తి మొలకలు ఎండుతున్నాయి..
కొన్ని రోజుల క్రితం కురిసిన తొలకరి జల్లులకు 3 ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటడంతో మొలకెత్తాయి. ప్రస్తుతం సరైన వర్షాలు కురవకపోవడంతో పత్తి మొలకలు ఎండిపోతున్నాయి. విత్తనాలు, ఎరువుల కోసం భారీగా పెట్టుబడులు పెట్టి ఆందోళన చెందుతున్నాం. రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురవకపోతే మొత్తం మొలకలు ఎండిపోతాయి. దీంతో మరింత నష్టం ఏర్పడే అవకాశం ఉంది.
– హింగే మనోహర్, రైతు, పీచర
వానల కోసం ఎదురు చూస్తున్నా
ఐనవోలు: నాకు చెలుక, పొలం కలిపి 7.5 ఎకరాల వరకు ఉంది. 3 ఎకరాల్లో పత్తి, ఎకరం పసుపు సాగు చేస్తున్న. వానలు సరిగ్గా కురవక రెండుసార్లు పత్తి విత్తనాలు పెట్టాల్సి వచ్చింది. వ్యవసాయ అధికారుల సూచన మేరకు 2 ఎకరాల్లో పల్లికాయ వేశాను. మిగిలిన ఎకరంన్నరలో తిండి గింజల కోసం వరి సాగు కోసం వర్షాల కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పటికే పెట్టుబడి 60 వేలు దాటింది. ఏటా మాదిరిగా వానలు సరిగ్గా కురవకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సరైన వర్షాలు కురవకపోతే తీవ్రంగా నష్టపోతాం. పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలి.
– నిమ్మాని వెంకటేశ్వరరావు, రైతు, కక్కిరాలపల్లి
●


