● డీఐఈఓ శ్రీధర్ సుమన్
కాళోజీ సెంటర్: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆధార్ బయోమెట్రిక్ నవీకరణ త్వరగా పూర్తి చేయాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. శుక్రవారం నగరంలోని కృష్ణా కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆధార్ నవీకరణ కేంద్రం నిర్వహిస్తున్న తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధారించిన తేదీల్లోగా విద్యార్థుల బయోమెట్రిక్ (వేలి ముద్రలు), ఐరీష్, అడ్రస్ తదితర వివరాలను నవీకరించుకోవాలన్నారు. అనంతరం కళాశాలలో జరుగుతున్న తరగతులను పరిశీలించారు. పలువురు నూతన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శరదృతి, లైబ్రేరియన్ వనమాల, అధ్యాపకులు శర్మ, హరికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
కొనసాగుతున్న టీజీసీపీజీఈటీ
కేయూ క్యాంపస్: తెలంగాణలోని తొమ్మిది యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీసీపీజీఈటీ 2026 మూడోరోజు శుక్రవారం కూడా కొనసాగింది. 44 పీజీ కోర్సుల్లో 22 పరీక్ష కేంద్రాల్లో రోజుకు పలు కోర్సుల ప్రవేశపరీక్షలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం సెషన్‌లో జర్నలిజం అండ్‌మాస్ కమ్యూనికేషన్ కోర్సుకు 748 మంది అభ్యర్థులకు 608 మంది హాజరైనట్లు సీపీజీఈటీ కన్వీనర్ ఆచార్య కె.రాజేందర్ తెలిపారు. మధ్యాహ్నం సెషన్‌లో ఎంపీఈడీ కోర్సుకు 1,293 మంది అభ్యర్థులకు 1,148 మంది హాజరయ్యారు. సాయంత్రం సెషన్‌లో ఎంటీఎం, ఎమ్మెస్సీ జియా ఇన్ఫర్మేటిక్స్‌కు 324 మందికిగాను 263 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు.


