కాజీపేట: కాజీపేట మండలం సోమిడి గ్రామ వాస్తవ్యుడు, మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ లొంగిపోవాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షిస్తున్నారు. రెండు పదుల వయస్సులో పోరుబాట పట్టి దాదాపు 45 ఏళ్లుగా అజ్ఞాతంలో కొనసాగుతున్న ఆయన రాక కోసం నలుగురు అన్నదమ్ములతోపాటు కుటుంబ సభ్యులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని ఈస్ట్ రీజినల్ బ్యూరో వింగ్‌లో (టెక్నికల్) బాధ్యుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం దేశంలో కగార్ పేరుతో మావోయిస్టులను ఏరివేస్తుండడంతో అనేక మంది కీలక నాయకులు లొంగిపోతున్నారు. మరికొంత మందిని పారా మిలటరీ బలగాలు ఎన్‌కౌంటర్ చేస్తూ ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణంలోని సోమిడి గ్రామానికి చెందిన నరహరిపై నేడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. నరహరి ప్రభుత్వానికి లొంగిపోయి క్షేమంగా ఇంటికి రావాలని నలుగురు తోబుట్టువులు, స్నేహితులు వేడుకుంటున్నారు.
డిగ్రీ చదువుతూ.. ఉద్యమం వైపు అడుగులు
సోమిడి గ్రామానికి చెందిన పసునూరి నర్సమ్మ–సోమనారాయణకు ఐదుగురు కొడుకులు. వీరిలో రెండో కుమారుడు నరహరి 1980 సంవత్సరంలో ఎల్‌బీ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా నక్సల్స్ విధానాలకు ఆకర్షితుడయ్యాడు. అప్పటి రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, క్రాంతిరణదేవ్ అలియాస్ బక్కన్నతో ఏర్పడిన స్నేహం ఆయనను ఉద్యమం వైపు అడుగులు వేయించింది. గ్రామంలో ఉంటూ కూలీల రేట్లు పెంచడంతోపాటు భూస్వాములు, రౌడీలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అప్పటి ఆర్‌ఈసీలో ఉన్న ఉద్యమ నాయకుల మాటలతో ప్రభావితమైన నరహరి పోలీసుల నిర్బంధం పెరగడంతో అడవి బాట పట్టాడు. 1981లో అడవిలోకి వెళ్లిన నరహరి.. తల్లిదండ్రులతో పాటు ఎవరూ చనిపోయిన ఇంటి ముఖం చూడలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నరహరి ప్రభుత్వానికి లొంగిపోయి సోమిడికి చేరుకోవాలని నలుగురు సోదరులు కోరుతున్నారు.
వేడుకుంటున్న సోదరులు,
కుటుంబ సభ్యులు
45 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన సోమిడి వాసి
జార్ఖండ్ టెక్నికల్ వింగ్‌లో బాధ్యతలు


