డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి
విద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలని డెమోట్రిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి డిమాండ్ చేశారు. హనుమకొండలో ఆ సంఘం జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యారంగంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణను నియంత్రిస్తూనే ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర విద్యావిధానం –2026 పేరుతో ఇటీవల విడుదల చేసిన నివేదికపై ఉపాధ్యాయ సంఘాలు, నిపుణులతో చర్చించి విద్యారంగం బలోపేతానికి చర్యలు చేపట్టాలన్నారు. అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకుడు గంగాధర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులను తరగతిగదికి దూరం చేసే కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ విద్యారంగం బలహీన పడుతుందన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదలచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఉప్పలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా కమిటీ బాధ్యులు అంజనీదేవి, సారంగపాణి, అల్లం మల్లయ్య, కిషన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సంజీవరెడ్డి, సుభాషిణి, హర్షవర్ధన్‌రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


