సమృద్ధిగా జలాలు
జిల్లాలో సగటున
3.10 మీటర్ల లోతు
హన్మకొండ: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఈసారి భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. డిసెంబర్ చివరి నాటికి సగటున 3.10 మీటర్ల లోతులో ఉండగా, గత వర్షాకాలం చివరలో కురిసిన అతి భారీ వర్షాలకు చెరువులు, కుంటల్లో నీరు తొణికిసలాడుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో పాటు జలాశయాల్లో నీరు చేరి అలుగులు పోస్తున్నాయి. భూగర్భ జలాలు చేతికి అందే స్థాయిలో ఉన్నాయి. ధర్మసాగర్‌లో 0.91 మీటర్ల లోతులోనే ఉన్నాయి. మీటర్ కంటే తక్కువ లోతులో ఉన్నాయంటే భూగర్భ జలాలు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయో తెలుస్తోంది.
అత్యధికంగా
భీమదేవరపల్లిలో..
భీమదేవరపల్లి మండలం వంగరలో జిల్లాలోనే అత్యధికంగా 7.85 మీటర్ల లోతులో నీళ్లున్నాయి. వర్షాకాలంలో జిల్లాలో సాధారణ వర్షపాతం 924.5 మిల్లీమీటర్లు నమోదుకాగా.. ఈ వర్షాకాలంలో 1204.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వేలేరులో అతి ఎక్కువగా వర్షం (లార్జ్ ఎక్సెస్) వర్షపాతం నమోదైంది. ఇక్కడ సాధారణ వర్షపాతం 776 మిల్లీమీటర్లు కాగా, 1,352.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భీమదేవరపల్లి, ఎల్క తుర్తి, కమలాపూర్, ధర్మసాగర్, కాజీపేట, హనుమకొండ, ఐనవోలు, దామెర, ఆత్మకూరు మండలాల్లో సాధారణానికి మించి ఎక్సెస్ వర్షం కురిసింది. హసన్‌పర్తి, పరకాల, శాయంపేట, నడికూడ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
పది మండలాల్లో ఎక్సెస్..
10 మండలాల్లో ఎక్సెస్ వర్షపాతం నమోదు కావడంతో ఆ మేరకు భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో యాసంగిలో సాగు నీటి కొరత ఉండే అవకాశం లేదు. భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండడంతో యాసంగి ఆశాజనకంగా సాగుతోంది. జిల్లాలో అన్ని పంటలు కలిపి 1,94,210 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 1,29,500 ఎకరాలు, మొక్కజొన్న 64,100, వేరు శనగ 370, పప్పు దినుసులు 240 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. సాగుకు పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో ఈసారి అంచనాకు మించి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది. భూగర్భ జలాల గణన, సర్వే కోసం జిల్లాలో 25 బోరు బావులు తవ్వి, ఫీజో మీటర్లు ఏర్పాటు చేశారు. ఫీజో మీటర్ల ద్వారా భూగర్భ జలాల వివరాలు సేకరిస్తారు. ప్రతీ నెల చివరి వారంలో భూగర్భ జలాల వివరాలు సేకరించి ప్రభుత్వానికి జిల్లా భూగర్భ జల శాఖ అధికారులు పంపిస్తారు.
గట్ల నర్సింగాపూర్ 1.8
జగన్నాథపూర్ 4.2
కొత్తపల్లి 4.56
వంగర 7.85
ధర్మాపూర్ 1.91
ధర్మసాగర్ 0.91
పెద్ద పెండ్యాల 2.72
నారాయణగిరి 1.02
ఎల్కతుర్తి 7.54
హనుమకొండ 2.94
నాగారం 4.85
సీతంపేట 1.06
ఎల్లాపూర్ 1.32
ఐనవోలు 6.23
పున్నేలు 2.06
పంథిని 4.29
శనిగరం 1.19
పీచర 4.56
వేలేరు 1.26
ఆత్మకూరు 1.71
దామెర 1.23
చెర్లపల్లి 5.29
నడికూడ 1.96
పరకాల 2.54
పత్తిపాక 2.38
జిల్లాలో భూగర్భ జలాలు (లోతు మీటర్లలో)


