వరి సాగుకే మొగ్గు
యాసంగిలో సమృద్ధిగా నీరు..
అవసరం మేరకు ఎరువులు
పంటల అవసరం మేరకు ఎరువులు అందుబాటులో ఉండేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. నెలవారీగా ఎరువుల అవసరాన్ని గుర్తించి ప్రతిపాదనలు పంపించారు. వీటిలో కొన్ని యాసంగి పంట కాలానికి సంబంధించి డిసెంబర్ 28వ తేదీ వరకు 14,375 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశారు. అలాగే యూరియా పంపిణీలో అక్రమాలు చోటు చేసుకోకుండా కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు మండలాల వారీగా 13 మంది ప్రత్యేక మానిటరింగ్ అధికారులను నియమించారు. వీరి పర్యవేక్షణలో యూరియా టోకెన్లను పంపిణీ చేస్తున్నారు.
వరి ఎక్కువగా సాగవుతోంది..
యాసంగి పంటల సాగుకు తగ్గట్టుగా యూరియా నిల్వ లు ఉన్నాయి. చెరువులు, కుంటలు, బావుల్లో పుష్కలంగా నీరు ఉండటంతో యాసంగిలో ఎక్కువగా వరి సాగవుతోంది. రైతులు మోతాదుకు మించి ఎరువులు వాడొద్దు. అన్ని మండల కేంద్రాల్లో నిల్వలు ఉన్నాయి. ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
– అనురాధ, జిల్లా వ్యవసాయ అఽధికారి
ఖిలా వరంగల్: జిల్లాలో వానాకాలం సీజన్ పూర్తి అయ్యింది. యాసంగి సాగు ప్రారంభమైంది. ప్రధానంగా మొక్కజొన్న, వేరుశనగ, కంది, వరి పంటలను సాగు చేస్తున్నారు. బావులు, బోర్లు, చెరువుల్లో నీరు ఉండటంతో అన్నదాతలు వరి సాగుపై మొగ్గు చూపుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా వ్యవసాయ అధికారులు ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచి పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. జిల్లాలోని 13 మండలాల్లో చెరువులు, కుంటలు, బావులు, బోర్ల కింద రైతులు యాసంగి పంటలను సాగు చేస్తున్నారు. రైతులు ఎక్కువ శాతం బావులు, బోర్లపైనే సాగు ఆధారపడి ఉన్నారు. ఈ సంవత్సరం వర్షాలు అనుకూలంగా కురవడం, విద్యుత్ సమస్య లేకపోవడంతో ఎక్కువ మంది రైతులు యాసంగి పంటల సాగుకు మొగ్గు చూపారు. 2025–26లో జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న పంట 26,510 ఎకరాలు, కూరగాయలు, వరి ఇతర పంటలు మొత్తం 1,11,435 ఎకరాల్లో సాగు అవుతున్నాయి. ఇప్పటివరకు 3,56,392 యూరియా బస్తాలు అధికారులు రైతులకు సరఫరా చేశారు. ప్రస్తుతం పీఏసీఎస్‌లు, ప్రైవేట్ డీలర్ల వద్ద 890 మెట్రిక్ టన్నులు, మార్క్‌ఫెడ్ వద్ద 3,300 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, జిల్లాలో యూరియా కొరత లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
జిల్లాలో 1,11,435 ఎకరాల్లో వరి సాగు
అందుబాటులో యూరియా నిల్వలు
వరి సాగుకే మొగ్గు


