ముగిసిన బ్రహ్మోత్సవాలు
గీసుకొండ: గీసుకొండ లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర మంగళవారం రాత్రి ముగిశాయి. స్వామి వారిని పల్లకీపై గుట్టకిందికి తోడ్కొని వెళ్లి గీసుకొండలోని వేణుగోపాలస్వామి ఆలయ ప్రవేశం చేయించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగుల సాంబరెడ్డి తెలిపారు. సహకరించిన భక్తులు, దాతలు, పోలీసు, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు టీవీలు
కాళోజీ సెంటర్: జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు డిజిటల్ టీవీలు పంపిణీ చేసినట్లు ఇంటర్ విద్యాశాఖ జిల్లా అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదేశానుసారం ఒక్కో కళాశాలకు రూ.6 లక్షల విలువైన డిజిటల్ బోధనకు ఉపకరించే సామగ్రి పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వీటి ద్వారా ఐఐటీ, ఎప్‌సెట్, నీట్ బోధన సులభతరం అవుతుందని తెలిపారు. ఇప్పటికే ప్రాక్టికల్స్ కోసం జూనియర్ కళాశాలకు రూ.50 వేల చొప్పున మంజూరు చేసినట్లు ఆయన వివరించారు.
కడారిగూడెంలో
వృద్ధుడి ఆత్మహత్య
వర్ధన్నపేట: ఆస్తి తగాదాల్లో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం కడారిగూడెంలో చోటుచేసుకుంది. వర్ధన్నపేట ఎస్సై సాయిబాబు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పింగిళి తిరుపతిరెడ్డి(60) హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇద్దరు కుమార్తెల తర్వాత మొదటి భార్య మృతి చెందగా రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కూతుళ్లు కడారిగూడెంలోని ఆయన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. రెండో భార్య, కుమారుడితోపాటు తిరుపతిరెడ్డి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. గ్రామంలో వీరికి ఉన్న 8 గుంటల భూమి, ఇల్లును తనకు ఇవ్వాలని తల్లిదండ్రులను కోరాడు. తాము ఆ భూమి ఇవ్వడం కుదరదని, కూతుళ్లు ఉన్నారని అనడంతో ఈ వివాదం కొనసాగుతోంది. భూమి, ఇల్లు ఇవ్వడం లేదని మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్ నుంచి కడారిగూడెం గ్రామానికి వచ్చాడు. బుధవారం ఉదయం గ్రామ శివారులో గుర్తు తెలియని పురుగుల మందు తాగి మృతిచెంది కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయిబాబు తెలిపారు.
మూడు కిలోల
గంజాయి పట్టివేత
దుగ్గొండి: భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న మూడు కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దుగ్గొండి సీఐ సాయిరమణ, ఎస్సై రావుల రణధీర్‌రెడ్డితో కలిసి బుధవారం వివరాలు వెల్లడించారు. పక్కా సమాచారం మేరకు దుగ్గొండి మండలం గిర్నిబావిలో ఎస్సై రణధీర్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. భద్రాచలం ప్రాంతానికి చెందిన గొల్ల కృష్ణారెడ్డి, మర్రి సాయితేజ భద్రాచలంలో మూడు కిలోల ఎండు గంజాయిని కొనుగోలు చేశారు. ఈ గంజాయిని ఎక్కువ ధరకు విక్రయించాలనే ఉద్దేశంతో ఆటోలో దుగ్గొండి మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. వారి వద్ద మూడు కిలోల గంజాయి లభ్యమైంది. గంజాయి, ఆటోను, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.
వరంగల్ రైల్వే స్టేషన్‌లో..
ఖిలా వరంగల్: భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ సురేందర్ తెలిపారు. వరంగల్ జీఆర్పీ స్టేషన్‌లో బుధవారం ఆయన కేసు వివరాలు వెల్లడించారు. వరంగల్ రైల్వేస్టేషన్‌లో బుధవారం జీఆర్పీ పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మూడో నంబర్ ప్లాట్‌ఫారంపై అనుమానాస్పదంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోలక్‌సర్కారు, ఒడిశాకు చెందిన శేషాదేబ్ గెడాయి కనిపించారు. వారి బ్యాగులను తనిఖీ చేసి రూ.1,19,850 విలువైన 2.397 కిలోల ఎండుగంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ముగిసిన బ్రహ్మోత్సవాలు


