ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య
● డీఈఓ రంగయ్యనాయుడు
వర్ధన్నపేట: ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి సర్పంచ్ శారద సోము కృషి అభినందనీయమని జిల్లా విద్యాశాఖాధికారి రంగయ్యనాయుడు అన్నారు. ల్యాబర్తి సర్పంచ్ శారదసోము ప్రభుత్వ పాఠశాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్యాలెండర్లను బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉపాధ్యాయులు మెరుగైన విద్యనందిస్తారని, ప్రజలను చైతన్యం చేసే దిశగా క్యాలెండర్‌ను రూపొందించడం అభినందనీయమన్నారు. పాఠశాలల బలోపేతానికి స్థానిక ప్రజాప్రతినిధులు సహకారం ఎంతో అవసరమన్నారు. ఉప సర్పంచ్ గంగరాజు, హెచ్‌ఎం వేణు, ఉపాధ్యాయులు హరిలాల్, వెంటకస్వామి, నాగరాజు, రఘువీర్, శివకుమార్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
వర్క్‌సైట్ స్కూల్ ఏర్పాటు చేయాలి
గీసుకొండ: శాయంపేట హవేలిలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు (కేఎంటీపీ)లో పనిచేస్తున్న కార్మికులు తమ పిల్లలను బడికి పంపించి చదివించాలని డీఈఓ బి.రంగయ్యనాయుడు సూచించారు. బుధవారం ఆయన కేఎంటీపీని సందర్శించి బడికి వెళ్లకుండా ఉన్న పిల్లలతోపాటు వారి తల్లిదండ్రుతో మాట్లాడారు. కార్మికులు పనిచేస్తున్న పరిశ్రమలు, యూనిట్ల యాజమాన్యాలు కార్మికుల పిల్లలకు ప్రత్యేకంగా వర్క్‌సైట్ స్కూల్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. బడికి వెళ్లకుండా ఎవరూ ఉండకూడదని, బడిఈడు పిల్లలను గుర్తించి బడికి పంపించేందుకు సర్వే చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం గొర్రెకుంట, ధర్మారం జెడ్పీ, ప్రాథమిక పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏఎంఓ సుజన్‌తేజ, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, ఎంఈఓ రవీందర్, హెచ్‌ఎంలు సాంబయ్య, సీఆర్పీలు పాల్గొన్నారు.


