5 గంటలు.. 15 అంశాలు
పెండింగ్ పనులను పరుగులు పెట్టించాలి
ప్రశంసలు.. మందలింపులు..
ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సుదీర్ఘ సమీక్ష
సాక్షిప్రతినిధి, వరంగల్/హన్మకొండ అర్బన్ : ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్కతో కలిసి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం హనుమకొండలోని కలెక్టరేట్(ఐడీఓసీ)లోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. సుమారు ఐదు గంటలకుపైగా జరిగిన సమావేశంలో సీఎం సలహాదారు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఆరు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ప్రధానంగా మామునూరు ఎయిర్‌పోర్టు, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు, వరంగల్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, వరద నీటి కాల్వల వ్యవస్థ, పారిశుద్ధ్యం, ఇన్నర్ రింగ్ రోడ్డు, భద్రకాళి మాడవీధులు, భద్రకాళి చెరువు పూడికతీత పనులు, రెండు పడకల గదుల ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, యూరియా, వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియ, యాసంగి సంసిద్ధత ఇలా మొత్తం 15 అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఇళ్ల సమస్యకు 15 రోజుల్లో పరిష్కారం..
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించాలని గృహ నిర్మాణశాఖ ఎండీ వీపీ గౌతమ్‌ను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, అలాగే వాటికి చెల్లింపులు చేయాలన్నారు. ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారని, రెండు పడకల గదుల ఇళ్ల (2– బీహెచ్‌కే) ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలన్నారు. ఈనెల 20వ తేదీలోగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి మౌలిక సదుపాయాల పనులు పూర్తిచేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రెండు పడక గదులకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈనెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
హైదరాబాద్ స్థాయిలో నగర అభివృద్ధి
వరంగల్‌ను హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క(అనసూయ) అన్నారు. ఆదివాసీ లకే కాకుండా కోట్లాదిమంది గిరిజనేతరులకు ఇలవేల్పులైన మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెలతో పాటు ఆలయ ప్రాంగణం పునరుద్ధరణకు సీఎం ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మురళీనాయక్, గండ్ర సత్యనారాయణరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, హౌసింగ్ ఎండీ వీపీ గౌతమ్, కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్య శారద, రాహుల్‌శర్మ, రిజ్వాన్ బాషా షేక్, అద్వైత్ కుమార్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మాడవీధుల పనుల పరిశీలన
హన్మకొండ కల్చరల్: నగరంలోని భద్రకాళి దేవాలయంలో కొనసాగుతున్న మాడవీధుల నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి మంత్రి పొంగులేటి పరిశీలించారు. మాడ వీధుల మ్యాప్‌ను చూసి త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. దేవాలయం మీద రాజకీయం చేస్తున్న వారికి ఒకటే చెబుతున్నామని, అభివృద్ధి కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్న విషయాన్ని గమనించాలని హితవు పలికారు. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు. మాడవీధులకు ఖర్చు చేసే ప్రతీ పైసాకు లెక్క చెప్పాలని అధికారులను ఆదేశించారు.
పాల్గొన్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు
అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, మామునూరు ఎయిర్‌పోర్టుపై స్పష్టత
అభివృద్ధి, సంక్షేమ పథకాలు పరుగులు పెట్టాలని అధికారులకు ఆదేశం
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరిక
పెండింగ్ పనులను పరుగులు పెట్టించాలని మంత్రి పొంగులేటి.. కలెక్టర్లు, అధికారులకు సూచించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు రెండో దశ పనుల కోసం రూ.305 కోట్లతో చేపట్టే భూసేకరణ త్వరగా జరిగేలా చూడాలని ఆదేశించారు. రూ.30కోట్లతో భద్రకాళి మాడవీధుల పనులు జరుగుతున్నాయని, పూజారుల నివాస గదులు, సత్రం పనులు కొనసాగుతున్నాయన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అన్ని పనులు మార్చి 31 నాటికి పూర్తిచేయాలని, సీఎం రేవంత్‌రెడ్డి ఆస్పత్రిని ప్రారంభిస్తారన్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా మామునూరు ఎయిర్‌పోర్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు
ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమంపై సాగిన సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి పలువురిని మందలించారు. బాగా పనిచేసిన అధికారులను ప్రశంసించారు. మామునూరు ఎయిర్‌పోర్టుకు నిర్ణీత సమయంలో భూసేకరణ పూర్తి చేసినందుకు వరంగల్ కలెక్టర్ సత్యశారద, రెవెన్యూ అధికారులను అభినందించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రంలో జనగామ ముందంజలో ఉందని ఆ జిల్లా కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్, సంబంధిత అధికారులను ప్రశంసించారు. ఐఅండ్‌పీఆర్ శాఖ, పౌరసంబంధాలశాఖ డీఈఈ పనితీరు బాగా లేదన్నారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని, అధికారుల పనితీరు బాగా లేకపోవడం వల్లే నిత్యం ఆ జిల్లా పతాక శీర్షికలకు ఎక్కుతోందని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్‌ను ఉద్దేశించి అన్నారు.
5 గంటలు.. 15 అంశాలు


