యోగా పోటీలకు ఇల్లంద విద్యార్థినులు
వర్ధన్నపేట: దక్షిణ భారతస్థాయి యోగా పోటీలకు ఇల్లంద విద్యార్థినులు ఎంపికయ్యారని హెచ్‌ఎం ఆర్.కృష్ణ తెలిపారు. ఈనెల 3న వరంగల్ యోగా భవన్‌లో నిర్వహించిన పోటీల్లో విద్యార్థినులు రాధిక, వెన్నెల అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న దక్షిణ భారత స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని తెలి పారు. ఈ సందర్భంగా బుధవారం విద్యార్థినులను హెచ్‌ఎం కృష్ణ, ఉపాధ్యాయులు అభినందించారు.
నేడు నీటి సరఫరా బంద్
వరంగల్ అర్బన్: వరంగల్ దేశాయిపేట ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్ పరిధిలో గణేశ్‌నగర్, దేశాయిపేట రోడ్డు ప్రాంతంలో ప్రధాన పైపులైన్‌కు లీకేజీ కారణంగా వరంగల్ ప్రాంతంలో తాగునీటి సరఫరా బంద్ ఉంటుందని బల్దియా ఎస్‌ఈ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. పైపులైన్ మరమ్మతు పనులు కొనసాగుతున్నందున ఫిల్టర్ బెడ్ పరిధిలో నీటి సరఫరా ఉండదని పేర్కొన్నారు. దీంతో మొగిలిచర్ల, ధర్మారం, గొర్రెకుంట, కీర్తి నగర్, ఆరెపల్లి, పైడిపల్లి, దేశాయిపేట, ఏనుమాముల, పోచమ్మ మైదాన్, ఎల్‌బీ నగర్, కాశి బుగ్గ, చార్‌బౌళి, ఎంజీఎం, గోవిందరాజుల గుట్ట, ఓ సిటీ, క్రిస్టియన్ కాలనీ, పోతనరోడ్డు, ఎన్టీఆర్ నగర్, సంతోషిమాత కాలనీ, మట్టెవాడ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు.
బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు కేయూ మహిళా జట్టు
కేయూ క్యాంపస్: విజయవాడలోని ఎన్‌టీఆర్ యూనివర్సిటీ హెల్త్‌సైన్సెస్‌లో ఈనెల 6న ప్రారంభమై 9వ తేదీ వరకు జరగనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ మహిళా జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జట్టులో ఎస్.శ్రినిత, పి.లక్ష్మీరెడ్డి, ఎన్.అశ్విత, కె.దీక్షిత, ఎస్‌కె.ఆయూషాఖుర్షిద్ ఉన్నట్లు పేర్కొన్నారు. కొత్తగూడెం సింగరేణి ఉమెన్ డిగ్రీకళాశాల ఫిజికల్ డైరెక్టర్ కె.సావిత్రి కోచ్ కమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు.


