పైసలిస్తేనే పోస్టుమార్టం
ఎంజీఎం: సంబంధీకులు చనిపోయారనే బాధ ఒకవైపు. ఆ శవాలపై పైసలు చల్లితే ఏరుకోవాలని చూసే వైద్యులు, సిబ్బంది వేధింపులు మరో వైపు. వెరసి బాధిత కుటుంబీకుల వేదన వర్ణనాతీతం. ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలో ఒక్కో మృతదేహం పోస్ట్‌మార్టం చేయడానికి రూ.4 వేలకుపైగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ డబ్బులివ్వకపోతే పోస్టుమార్టం పరీక్షలకు గంటల కొద్ది తాత్సారం చేస్తున్నారు. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ రోగులను జలగల్లా పీక్కుతినడం ఇక్కడి స్వీపర్ నుంచి మొదలు పెడితే కొంత మంది వైద్యుల వర కు అలవాటుగా మారిందనే ఆరోపణలున్నాయి.
సమయాని కంటే ముందే వెళ్లిన వైద్యులు
ఖిలావరంగల్‌కు చెందిన లక్కరసు రవి(51) బుధవారం తన ఇంటికి సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. వెంటనే కుటుంబ సభ్యులు మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి ఎంజీఎం ఆస్పత్రి క్యాజువాలిటీకి తీసుకొచ్చారు. అతడిని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించి మెడికల్ లీగల్ కేసుగా నమోదు చేసి పోస్టుమార్టం అవసరమని నిర్ధారించారు. అనంతరం కుటుంబీకులు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. రవి కుటుంబ సభ్యులు మిల్స్‌కాలనీ పోలీసులకు సమాచారమిచ్చారు. పంచనామా పూర్తయ్యే వరకు సాయంత్రం 5 అయ్యింది. ఆ సమయం వరకు విధుల్లో ఉండాల్సిన డ్యూటీ వైద్యులు 4 గంటలకే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
రూ.4 వేలు ఇవ్వనందుకు 4 గంటల ఆలస్యం
రవి మృతదేహం పోస్టుమార్టం కోసం గురువారం ఉదయం మరోసారి మార్చురీకి చేరుకున్న బందుమిత్రులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. పంచనామా పత్రాన్ని సమర్పించినా మృతదేహాన్ని సదరు పోలీసులు నిర్ధారించాలని పోస్టుమార్టం సిబ్బంది తెలుపడంతో మరోసారి బంధుమిత్రులు పోలీసుల వద్దకు పరుగులు పెట్టారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీసులు మార్చురీ వద్దకు చేరుకుని శవాన్ని నిర్ధారించారు. అనంతరం కింది స్థాయి సిబ్బంది ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. బుధవారం సాయంత్రం మార్చురీలో భిక్షపతి అనే వ్యక్తి రూ.4 వేలు డిమాండ్ చేయగా.. మృతుడి బంధుమిత్రులు రూ. 2 వేలు ఉన్నాయి అంతకు మించి ఇవ్వలేమని చెప్పారు. దీంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు బంధుమిత్రులు తెలిపారు. గురువారం మరో మారు బంధుమిత్రులు సూపరింటెండెంట్‌ను సంప్రదించి మార్చురీ గదిలోకి వెళ్లగా డబ్బులివ్వలేదనే కారణంతో పోస్టుమార్టం పూర్తయినప్పటికీ మృతదేహాన్ని ఇవ్వకుండా గంట పాటు పక్కకు పెట్టినట్లు ఆవేదనతో బాధిత కుటుంబీకులు వెల్లడించారు.
రోజూ 8 నుంచి 10 మృతదేహాలకు
శవ పరీక్షలు
ఒక్కో మృతదేహానికి రూ.నాలుగు
వేలకుపైగా వసూళ్లు
ఎంజీఎంలో అడుగడుగునా అవినీతి


