అట్టహాసంగా సీఎం కప్ టార్చ్ ర్యాలీ
వరంగల్ స్పోర్ట్స్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సీఎం కప్ క్రీడాపోటీల టార్చ్ ర్యాలీ హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వద్ద గురువారం ప్రారంభమైంది. ఈ ర్యాలీ జిల్లాలోని అన్ని మండల కేంద్రాలను చుడుతూ రెండు రోజులపాటు కొనసాగనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా సీఎం కప్ క్రీడాపోటీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని ఒలింపిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు అజీజ్‌ఖాన్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రవి, డీవైఎస్ఓ గుగులోత్ అశోక్‌కుమార్, అథ్లెటిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు, రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు, డీఎస్ఏ కోచ్‌లు, క్రీడాకారులు, యువత పాల్గొన్నారు.
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో పరికరాల కొరతను గుర్తించిన సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి ఒక్కొక్కటిగా రోగులకు అందుబాటులోకి తెస్తున్నారు. అత్యవసర సమయంలో అందించే సేవలకు ఉండాల్సిన ఆరు ఈసీజీ మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. హృద్రోగులకు మెరుగైన చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవడంతో మరణ ధ్రువీకరణ కూడా తొందరగా జరిగేలా చర్యలు చేపట్టారు. అలాగే ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి వచ్చే రోగులతో పాటు అత్యవసర వార్డులో అందుబాటులో ఉండే రూ.16 లక్షల విలువైన నాలుగు డిఫిబ్రిలేటర్లు డీఎంఈ నరేంద్రకుమార్ సహకారంతో శుక్రవారం ఎంజీఎంకు చేరుకున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు.
ఖిలా వరంగల్: వార్షిక తనిఖీలో భాగంగా వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌ను ఏఎస్పీ శుభం ప్రకాశ్‌తో కలిసి గురువారం సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసుల పురోగతిని తెలుసుకున్నారు. వాటికి సంబంధించి పలు సూచనలిచ్చారు. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా మెలగాలని సూచించారు. అంతకుముందు ఏఎస్పీ శుభం, ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ వేర్వేరుగా డీసీపీ కవితకు మొక్క అందజేసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రమేశ్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
వరంగల్: తెలంగాణ హౌసింగ్ బోర్డు వరంగల్ డివిజన్ అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్(ఏఈఓ)గా పీఆర్ఓ వి.వాసుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఏఈఓ సెలవులో ఉన్నందున ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. వరంగల్ డివిజన్‌కు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులు, సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజలు వాసును సంప్రదించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఖిలా వరంగల్: మామునూరు విమానాశ్రయం రన్‌వే విస్తరణ నేపథ్యంలో గవిచర్ల రోడ్డు మూసివేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా నెక్కొండ నుంచి వచ్చే దారిలో గుంటూరుపల్లి గ్రామ చివరలో మూసివేయనున్నారు. అదేవిధంగా నక్కలపల్లి గ్రామ మూలమలపు వద్ద మూసివేసి బైపాస్ నక్కలపల్లి చెరువు కట్టమీదుగా.. గాడిపల్లినుంచి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. నెక్కొండ నుంచి వరంగల్‌కు రావాలనుకునే వారు కాపులకనపర్తి గ్రామ జంక్షన్ నుంచి గాడిపెల్లి, దూపకుంట గ్రామంనుంచి శంభునిపేటకు చేరుకోవాల్సి ఉంటుంది. వరంగల్ నుంచి నెక్కొండకు వెళ్లాల్సిన వారు శంభునిపేట జంక్షన్ నుంచి దూపకుంట, గాడిపెల్లి మీదుగా కాపులకనపర్తి గ్రామజంక్షన్కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా నెక్కొండకు వెళ్లిపోవచ్చు. గుంటూరుపల్లి గ్రామస్తులు వరంగల్‌కు రావాలనుకుంటే బొల్లికుంట మీదుగా ఒక దారి, గాడిపెల్లి, దూపకుంటనుంచి శంభునిపేట రావొచ్చు. గాడిపల్లి, నక్కలపల్లి కట్టపై నుంచి రంగశాయిపేట జంక్షన్‌కు చేరుకునే అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. ఈ రహదారులను ఆర్అండ్బీ అధికారులు పరిశీలన చేసినట్లు తెలిసింది.
అట్టహాసంగా సీఎం కప్ టార్చ్ ర్యాలీ


