తెరపైకి ‘పీవీ’ జిల్లా!
సాక్షిప్రతినిధి, వరంగల్:
పీవీ హుజూరాబాద్ జిల్లా ఏర్పాటు ఉద్యమం మళ్లీ తెరపైకి వచ్చింది. పూర్వ వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని మండలాలను కలిపి కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో జేఏసీ గురువారం ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఇక్కడ పరకాల.. అక్కడ హుజూరాబాద్ జిల్లా ఏర్పాటు కోసం జేఏసీలుగా ఏర్పడి బలంగా ఉద్యమాలు నిర్వహించారు. ఇదే సమయంలో జిల్లాల్లో పర్యటించిన అప్పటి టీపీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం ఎ.రేవంత్‌రెడ్డిని జేఏసీ నాయకులు కలిశారు. హనుమకొండ జిల్లాలో కలిసిన భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలతో పాటు కరీంనగర్‌లోనే ఉన్న 10 మండలాలు కలిపి హుజూరాబాద్ కేంద్రంగా ‘పీవీ హుజూరాబాద్’ జిల్లా ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పీవీ హుజూరాబాద్ జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ఎన్నికల సభల్లో మెనిఫెస్టోగా ప్రకటించారు. ఆతర్వాత జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు సద్దుమణిగింది. ఇటీవల రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ‘మండలాలు, జిల్లాల ఏర్పాటు అశాసీ్త్రయంగా జరిగాయని, పునఃపరిశీలన చేస్తామని’ ప్రకటించారు. ఇప్పటికే వరంగల్, హనుమకొండ జిల్లాలను ఒక్క జిల్లాగా చేయాలన్న డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో పీవీ హుజూరాబాద్ జిల్లా ఏర్పాటు కోసం మళ్లీ ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది.
జిల్లాల ఏర్పాటు నుంచే ఉద్యమం
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్న జిల్లాల విభజన ద్వారానే ప్రజలకు పాలన చేరువవుతుందని అక్టోబర్ 11, 2016న జిల్లాల విభజన చేశారు. అదే సమయంలో ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని 14 మండలాలు కలిపి ‘పీవీ హుజూరాబాద్’ జిల్లా ఏర్పాటు చేయాలన్న ఉద్యమం తెరపైకి వచ్చింది. అప్పటికే ఆలస్యం కావడంతో 31 జిల్లాలను ప్రకటించిన ప్రభుత్వం 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం ములుగు, నారాయణపేట్ జిల్లాలను ప్రకటించారు. అప్పటి నుంచి పీవీ జయంతోత్సవాల సందర్భంగా కూడా పీవీ జిల్లాను ఏర్పాటు చేయాలంటూ జేఏసీలు బలంగా నినదించాయి. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం ఈటల రాజేందర్ మంత్రివర్గం నుంచి భర్తరఫ్... తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం పీవీ జిల్లాను ప్రకటించనుందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఇదే సమయంలో వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్ జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో అర్భన్, రూరల్ జిల్లాలను వరంగల్, హనుమకొండ జిల్లాలుగా మార్చడంతో ‘పీవీ హుజూరాబాద్’ జిల్లా ఏర్పాటుకు అడ్డంకిగా మారాయి.
వినతులు.. ప్రతిపాదనలు
హనుమకొండ జిల్లాలో కలిసిన ఉమ్మడి కరీంనగర్ మండలాలు భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్‌ను కలిపి 14 మండలాలతో పీవీ హుజూరాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని గవర్నర్, ముఖ్యమంత్రులకు జేఏసీలు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించాయి. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్, జేఎస్ భూపాలపల్లి జిల్లా చిట్యాల, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి, హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, సైదాపూర్, శంకరపట్నంతో పాటు కొత్తగా వంగర, చల్లూరును మండలాలుగా మార్చి జిల్లా చేయాలని అందులో ప్రతిపాదించారు. ఆమేరకు సాధ్యాసాధ్యాలపై సర్వేలు, చర్చలు జరిగాయి. కొన్నేళ్లుగా జిల్లా ఏర్పాటు వాయిదా ప డుతూ వస్తోంది. ఇటీవల అసెంబ్లీలో జిల్లాల ఏర్పాటుపై పునఃపరిశీలన, వరంగల్, హనుమకొండ జి ల్లాల విలీనం అంశాలు తెరమీదకు రావడం.. పీవీ హుజూరాబాద్ జిల్లా ఏర్పాటుకు సీఎం చొరవ తీసుకోవాలని గురువారం నుంచి మళ్లీ ఉద్యమాలు మొదలు కావడం చర్చనీయాంశంగా మారింది .
అసెంబ్లీ ఎన్నికల సమయంలో
ఉధృతంగా పోరు
ఉమ్మడి కరీంనగర్, వరంగల్
మండలాలతో జిల్లా మ్యాప్
గతంలో ప్రస్తావించిన
సీఎం రేవంత్‌రెడ్డి
మంత్రి పొంగులేటి తాజా ప్రకటనతో మళ్లీ జిల్లా ప్రస్తావన
వరంగల్, హనుమకొండ జిల్లాల విలీనంపై చర్చ
జేఏసీల ఆధ్వర్యంలో
మళ్లీ ఉద్యమాలకు శ్రీకారం


