కోటకు కబ్జా బీటలు!
కోట విస్తీర్ణం వివరాలు
జాయింట్ సర్వే చేస్తేనే అడ్డుకట్ట..
సాక్షి, వరంగల్:
చారిత్రక ఓరుగల్లు కోటకు ‘ప్రభుత్వ’మే బీటలు పారేలా చేసిందా.. ఒకప్పుడు ఢిల్లీ సుల్తాన్లు, హైదరాబాద్ నవాబుల దాడులు ఎదుర్కొన్న ఈ కోటను భద్రంగా ఉంచాల్సిన అధికారులు పట్టిచుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే కేంద్ర పురావస్తు శాఖకు చెందిన ఈ వరంగల్ కోట భూములు రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ప్రభుత్వ భూములు అని ఉన్నాయి. దీంతో సంబంధిత అధికారులు చర్యలు తీసుకునే అవకాశం లేకపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖతో తేటతెల్లమెంది. కోటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) విభాగం నోటీసులిస్తున్నా వాటిని కూల్చే విషయంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో అక్రమణలు రెట్టింపయ్యాయన్న విమర్శలున్నాయి. నాలుగేళ్లలో వరంగల్ కలెక్టర్‌కు మూడుసార్లు ఏఎస్‌ఐ అధికారులు లేఖలు రాసినా అక్రమ నిర్మాణాలను తొలగించి కోట భూములను పరిరక్షించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తాజాగా పేర్కొనడంతో గమనార్హం. ఇప్పటికై నా ఏఎస్‌ఐ అధికారులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో ఆ భూముల హద్దులను నిర్ణయించి అక్రమ కట్టడాలను కూల్చేస్తే చరిత్ర సజీవంగా ఉండనుంది.
నిబంధనలు అతిక్రమించి..
కేంద్ర ప్రాచీన స్మారక చిహ్నాలు, పురావస్తు స్థలాలు, అవశేషాల చట్టం 1958 ప్రకారం.. పురావస్తు కట్టడాలకు 100 మీటర్ల దూరం వరకు నిర్మాణాలకు అనుమతించరు. 100 నుంచి 200 మీటర్ల దూరంలో గతంలో ఉన్న ఇళ్లకు మరమ్మతు చేసుకోవాలన్నా, భవనాలు కట్టాలన్నా పురావస్తు శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) తీసుకోవాలి. ఈ నిబంధనలు ఆక్రమణదారులు కాలరాస్తున్నారు. ఏఎస్‌ఐ అనుమతి లేకుండా ఇంటి నంబర్లు, విద్యుత్ కనెక్షన్లు ప్రభుత్వ శాఖలు ఇచ్చాయన్న ఆరోపణలున్నాయి.
సమాచారమిచ్చినా చర్యలు లేవు..
వరంగల్ కోటలో ఆక్రమణలు ఎక్కువయ్యాయి. వ్యాపార సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడంతో 2022లోనే ఏఎస్‌ఐ అధికారులు ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత ఇతర అక్రమ నిర్మాణాల విషయంలోనూ ఎప్పటికప్పుడూ నోటీసులు జారీ చేసి రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు సమాచారమిచ్చినా చర్యలు తీసుకోకపోవడంతోనే చారిత్రక సంపద అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏఎస్‌ఐ, రెవెన్యూ అధికారులు కలిసి సర్వే చేపడితేనే కోటలో ఆక్రమణలు ఎన్ని ఉన్నాయనే లెక్క తేలనుంది. ఆ తర్వాత ఆయా భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చడంతో పాటు భూములను రెవెన్యూ రికార్డుల్లో ఏఎస్‌ఐకి బదిలీ చేస్తేనే ఈ కోట భద్రంగా ఉంటుందని వరంగల్‌వాసులు అంటున్నారు.
రెవెన్యూ రికార్డుల్లో సర్కారు భూములు అని ఉండడమే కారణం
మట్టి గోడలు పగులగొట్టి
ఇష్టారీతిన అక్రమ నిర్మాణాలు
కేంద్ర పురావస్తు శాఖ నోటీసులిచ్చినా పట్టించుకోని జిల్లా అధికారులు
నాలుగేళ్లలో ఏఎస్‌ఐ మూడుసార్లు
కలెక్టర్‌కు లేఖలు రాసినా చర్యలు శూన్యం
సీఎం రేవంత్‌రెడ్డికి తాజాగా కేంద్ర
మంత్రి కిషన్‌రెడ్డి లేఖతో మరోసారి చర్చ
రాతికోట : 50 ఎకరాల 13 గుంటలు
మట్టికోట : 169 ఎకరాల 10 గుంటలు
మాన్యుమెంట్‌లు : 157 ఎకరాల
25 గుంటలు
మాన్యుమెంట్‌లు అంటే స్వయంభూ టెంపుల్ కాంప్లెక్స్, వెంకటేశ్వర్ టెంపుల్, ఖుష్‌మహల్, శృంగార బావి (ట్యాంక్), ఏకశిల టెంపుల్, శివ టెంపుల్, జంగమయ్య టెంపుల్, నీలసాంబుని గుడి, వరాలమ్మ టెంపుల్, అమ్యూనిషన్ స్టోర్, దీపగడ్డ, మందలమ్మ టెంపుల్, ఎల్‌పీ గాంధీ టెంపుల్, కొండా మసీద్, హర్స్‌స్టేబుల్ సముదాయం.
కేంద్ర పురావాస్తు శాఖ, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేసి ఏఎస్‌ఐ ఆధీనంలోని భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో హద్దులు నిర్ణయించాలి. ఈ మొత్తం 377.8 ఎకరాల్లో ఎన్ని అక్రమ కట్టడాలున్నాయో గుర్తించి కార్పొరేషన్ సిబ్బంది సహకారంతో చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు మూడు విభాగాలు సమన్వయంతో పనిచేస్తేనే అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది.
ఈ చిత్రంలో కనిపిస్తున్నది కాకతీయ రాజధాని చుట్టూ పటిష్టంగా నిర్మించిన నీటికోట (అగర్త చెరువు). ఈ చెరువు క్రమక్రమంగా మాయమవుతోంది. 40 శాతం భూమిలో పేదలు గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తుండగా.. మిగిలిన 40 శాతం భూమిని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. మిగిలిన 20 శాతం భూమిలో అక్కడకక్కడ బతుకమ్మ ఆడుకునేందుకు చెరువు ఆనవాళ్లు కనిపిస్తాయి. మూడుకోటల్లో రాజధాని విస్తరించి ఉంంది. కేంద్ర పురావస్తుశాఖ పర్యవేక్షణలో చారిత్రక ఆలయాలు, నిర్మాణాలు ఉన్నాయి. కోట పరిసరాల్లో ఏ మూలన చూసినా చారిత్రక ఆలయాల ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ ఆలయాలకు 100 మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నిబంధనలు ఉన్నాయి. నోటీసులు జారీ చేసినా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి.
కోటకు కబ్జా బీటలు!
కోటకు కబ్జా బీటలు!


