బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేయండి
ఎల్కతుర్తి: కొత్తకొండ భద్రకాళి సమేత వీరభద్రస్వామి జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సోమవారం భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో ఆయా శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 9నుంచి 18వ తేదీవరకు జరగనున్న వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల (జాతర) ఏర్పాట్లపై అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. స్వామివార్లను భక్తులు ప్రశాంతంగా దర్శించుకునేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. కనీస వసతులు కల్పించాలన్నారు. పలు శాఖల ఏర్పాట్లను తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీఓ వీరేశం అధికారులు పర్యవేక్షించాలన్నారు. అనంతరం దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సునీత మాట్లాడుతూ.. ఆలయానికి రంగులు వేయించామని, జాతర సమయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భద్రకాళి సమేత వీరభద్రున్ని కలెక్టర్ దర్శించుకున్నారు. సమావేశంలో స్థానిక సర్పంచ్ సిద్దమల్ల రమ, విద్యుత్ శాఖ ఏఈ మధుసుదన్, జిల్లా పంచాయితీ అధికారి లక్ష్మీరమాకాంత్, డీఎమ్‌హెచ్‌ఓ అప్పయ్య, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ ఈఈ ఆత్మారాం, ఆర్టీసీ డీఎం అర్పిత, ఆర్‌ఎన్‌బీ డీఈ గోపీకృష్ణ తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ స్నేహ శబరీష్
అధికారులతో సమీక్ష


