సమస్యలు సత్వరమే పరిష్కరించండి
కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: అర్జీలను సత్వరమే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అర్జీదారుల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. మొత్తం ప్రజావాణికి 153 అర్జీలు అందాయి. అర్జీల పరిష్కార స్థితిని తప్పనిసరిగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని, సరైన రిమార్కులు లేకుండా దరఖాస్తులు క్లోజ్ చేయరాదని సూచించారు. ప్రత్యేకంగా తహసీల్దార్లు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు శాఖల వద్ద అధికంగా పెండింగ్‌లో ఉన్న అర్జీలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రభుత్వ వసతి గృహాల తనిఖీల సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి సేవల నాణ్యతను సమీక్షించాలని తెలిపారు.
ఓట్ల సవరణ వేగవంతం చేయాలి
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఓటర్ల నమోదు శాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో.. మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. బీఎల్‌ఓలు, ఆర్పీలు డోర్ టు డోర్ వెళ్లి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రవి, జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్, పరకాల, హనుమకొండ ఆర్డీఓలు డాక్టర్ కన్నం నారాయణ, రాథోడ్ రమేశ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను శాఖల అధికారులు పాల్గొన్నారు.


