సరిపడా యురియా నిల్వలు
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
నర్సంపేట రూరల్: జిల్లాలో పంటలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, అర్హులైన రైతులకు యూరియా బస్తాలు అందిస్తామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. నర్సంపేట మండలంలోని లక్నెపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ ఎరువుల పంపిణీ కేంద్రం, చెన్నారావుపేట మండలంలోని లింగగిరి గ్రామంలో ఎరువుల పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. యూరియా నిల్వలు, యూరియా టోకెన్ల పంపిణీ విధానంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా పంపిణీ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎక్కువ సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంట విస్తీర్ణం ఆధారంగా మాత్రమే ఎకరాకు ఒక బస్తా యూరియా తీసుకోవాలని, ప్రస్తుతం మొక్కజొన్న పంట వేసిన రైతులు మాత్రమే యూరియా తీసుకోవాలని కోరారు. నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలో 430, రామవరం 420, బాంజీపేటలో 170, చంద్రయ్యపల్లిలో 170 బస్తాలు, జగన్నాథపల్లిలో 80 బస్తాలు పంపిణీ, చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామంలో 444 బస్తాలు, జల్లిలో 444 బస్తాలు, అక్కల్‌చెడలో 4,444 బస్తాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. గోదాంలో 5,500 మెట్రిక్ టన్నుల యూరియ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, జిల్లా రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిల్వ ఉంచామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, జిల్లా సహకార అధికారి నీరజ, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


