కమ్మేసిన పొగమంచు
ఖిలా వరంగల్‌లోని
ఖుష్‌మహల్‌ను
కమ్మేసిన పొగమంచు
సాక్షి, వరంగల్: జిల్లాలో చలి తగ్గి, పొగమంచు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు పొగమంచుతో ప్రధాన, అంతర్గత రహదారుల్లో వెలుతురు సరిగా లేక (జీరో విజిబులిటీ) వాహనాలు నడిపేవారు అనేకపాట్లు పడ్డారు. కొన్నిచోట్ల వెలుతురు లేక డివైడర్లకు ఢీకొని వాహనదారులు కిందపడిపోగా, మరికొన్ని చోట్ల ఎదురుగా, ముందున్న వాహనాలను ఢీకొనడంతో పలువురు గాయపడ్డారు. రోజురోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు కాస్త పెరుగుతున్నా.. గాలిలో తేమశాతం పెరగడంతో పొగమంచు ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. మరో మూడు నుంచి నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, జాతీయ రహదారులు, ఔటర్‌రింగ్ రోడ్డుపై వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ కమిషనరేట్ పోలీసులు సూచిస్తున్నారు. వరంగల్‌లో 14.9 డిగ్రీ సెల్సియస్, హనుమకొండలో 15.4 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
ఉదయం 10.30 గంటల వరకు పొగమంచు..
సాధారణంగా శీతాకాలం సూర్యకిరణాలు ఆలస్యంగా వస్తాయి. దీంతో గాలిలో ఎక్కువగా ఉన్న తేమ శాతం పొగమంచులా కనిపిస్తుంది. గాలిలో ఉష్ణోగ్రత తగ్గితే.. గాలిలో ఎక్కువగా ఉన్న తేమ సూక్ష్మ బిందువుల రూపంలో ఘనీభవిస్తుంది. ఈ సూక్ష్మ బిందువులపై పడే కాంతి వివర్తనం చెంది అన్ని వైపులకు ప్రసరించి పొగమంచులా ఏర్పడుతుంది. ఇలా వరంగల్‌లో హ్యూమిడిటీ శుక్రవారం జీరోకు పడిపోవడంతోనే ఒక్కసారిగా విచిత్ర వాతావరణ పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ, సిమ్లా, ఊటీ మాదిరిగా పొగమంచు కురవడంతో ప్రజలు ఖిలా వరంగల్ ఫోర్ట్‌కు క్యూ కట్టారు. ఈ చారిత్రక మైదానంలో వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఫొటోలతో సెల్ఫీలు దిగారు. ఎత్తయిన భవనాల పైనుంచి పొగమంచు దృశ్యాలను సెల్‌ఫోన్లలో బంధించారు. భద్రకాళి, వేయిస్తంభాల ఆలయాల్లో కూడా పొగమంచు కప్పేసింది. ఉదయం 10.30 గంటల వరకు రహదారులపై మొత్తం మంచు దుప్పటి కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో ఉదయం 10.30 గంటల వరకు విచిత్ర వాతావరణం
వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిలో వాహనదారుల తిప్పలు
జాగ్రత్తలు పాటించాలని వరంగల్
కమిషనరేట్ పోలీసుల సూచన
జనవరి, డిసెంబర్ నెలల్లో పొగమంచుతో ప్రమాదాలు..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025 జనవరిలో పొగమంచుతో 112 రోడ్డు ప్రమాదాలు జరిగి 43 మంది మృతిచెందారు. 116 మంది గాయపడ్డారు. అదేవిధంగా గత సంవత్సరం మొత్తం 1,424 రోడ్డు ప్రమాదాలు జరిగి 430 మంది మృతి చెందారు. 1446 మంది గాయపడ్డారు. మార్చిలో ఎక్కువగా జరిగిన 52 ప్రమాదాల్లో 53 మంది మృతి చెందగా.. ఆ తర్వాత డిసెంబర్ నెలలోనే అత్యధికంగా 126 రోడ్డు ప్రమాదాలు జరిగి 39 మంది మృతి చెందారు. 115 మంది గాయపడ్డారు. పొగమంచుతోనే జనవరి, డిసెంబర్ నెలల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. ఈరెండు నెలల్లో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. చీకటి, జీరో విజిబిలిటీతో ముందు ఉండే వాహనాలు కనిపించకపోవడం, అప్పటికే రోడ్డుపై నిలిపిన వాహనాలను వెనుక నుంచి వచ్చి ఢీకొనడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వరంగల్ నగరంలో శుక్రవారం కురిసిన పొగమంచుతో పలుచోట్ల వాహనదారులు ప్రమాదాలబారిన పడి గాయపడ్డారు.
పార్కింగ్ లైట్లు వేసుకోవాలి..
మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుంది. వాహనదారులు ముఖ్యంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలి. ఏ వాహనమైనా పార్కింగ్ లైట్లు వేసుకుంటే ప్రమాదాలు జరగవు. అత్యవసర పని ఉంటే తప్ప ఉదయం వాహనదారులు రోడ్డెక్కవద్దు. ఒకవేళ తప్పనిసరి అయితే పార్కింగ్ లైట్లు వేసుకోవాలి.
– సన్‌ప్రీత్‌సింగ్, వరంగల్ పోలీస్ కమిషనర్
కమ్మేసిన పొగమంచు
కమ్మేసిన పొగమంచు
కమ్మేసిన పొగమంచు


