యూరియా కోసం రైతుల జాగారం
దుగ్గొండి: యాసంగి పంటలకు యూరియా కొరత ఏర్పడింది. ప్రస్తుతం పంటలు 20 నుంచి 40 రోజుల వయస్సులో ఉన్నాయి. ఈ సమయంలో తప్పనిసరిగా వేయాల్సిన యూరియా కోసం రైతులు జాగారం చేస్తున్నారు. మండలానికి గురువారం 2,660 బస్తాల యూరియా వచ్చింది. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఏఈఓలు యూరియా అందిస్తున్నారనే సమాచారంతో రాత్రి 12 గంటల నుంచే వారు క్యూలో ఉన్నారు. కొందరు రైతులు పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్‌తో పాటు చెప్పులను లైన్‌లో ఉంచారు. రాజ్యతండా, అడవిరంగాపురం, తిమ్మంపేట, నారాయణతండా, మహ్మదాపురం, మర్రిపల్లి, మల్లంపల్లి, చంద్రయ్యపల్లి, బొబ్బరోనిపల్లి, వెంకటాపురం, తొగర్రాయి, రేకంపల్లి, చలపర్తి గ్రామాలకు చెందిన రైతులకు ఒక్కొక్కరికి ఒక యూరియాబస్తా చొప్పున శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అందించారు. ఒకబస్తా కోసం గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చిందని, పరిస్థితి ఇలాగే ఉంటే యాసంగి పంటలపై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
చలిలోనూ బారులు..
ఖానాపురం: యూరియా కోసం రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. గోదాంలు, గ్రామ పంచాయతీల వద్ద తెల్లవారుజాము నుంచే చలిలోనూ బారులు తీరుతున్నారు. మండలంలోని ధర్మరావుపేట గ్రామంలో దట్టమైన పొగమంచును సైతం లెక్కచేయకుండా శుక్రవారం రైతులు క్యూలో నిల్చున్నారు. యూరియా తీసుకున్న వారే మళ్లీ మళ్లీ తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్సై రఘుపతి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
యూరియా కోసం రైతుల జాగారం


