గత డిసెంబర్ 31తో ముగిసిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల గడ
పురోగతిలో 10 ప్రాజెక్టుల పనులు
వరంగల్ అర్బన్:
ఆధునిక సాంకేతికతను జోడించి కొత్త ఆవిష్కరణలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు గడువు గత డిసెంబర్ 31న ముగిసింది. దీంతో గ్రేటర్ వరంగల్ పరిధి పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. కేవలం కొద్ది ఆవిష్కరణలతో సరిపెట్టుకుని సాధారణ పనులకే ప్రాధాన్యం కల్పించి, అధికారులు లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ప్రాజెక్టులకు టెండర్లు పూర్తయి పనులు ప్రారంభం కాకపోవడం, ఆలస్యంగా మొదలు పెట్టడం, అంచనాలు పెరగడం, కాంట్రాక్టర్ల అశ్రద్ధ ఇందుకు కారణమని తెలుస్తోంది. కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు నగర స్మార్ట్‌సిటీ పనుల జాప్యానికి ఇలా అనేక కారణాలున్నాయి. ఏదేమైనా కీలకమైన ఈ ప్రాజెక్టులపై గ్రేటర్ వరంగల్ పాలకవర్గం, అధికార యంత్రాంగం అడగుడునా నిర్లక్ష్యం వహించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2016లో స్మార్‌సిటీకి ఎంపిక
గ్రేటర్ వరంగల్.. 2016 సప్లిమెంటరీ స్మార్ట్‌సిటీ పథకంలో ఎంపికైంది. తొలుత రూ.2,376 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది. అనంతరం వివిధ ప్రాజెక్టులతో కలిసి ప్రతిపాదనలు రూపొందించారు. చివరగా రూ. 931 కోట్లతో 97 ప్రాజెక్టులు చేపట్టారు. 2017 నవంబర్ మూడో వారంలో అప్పటి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదిగో ఇదిగో అంటూ ఇలా సాగదీస్తూ ఐదేళ్ల ప్రాజెక్టులు కాస్త తొమ్మిదిన్నరేళ్లు గడిచినా ఇంకా పెండింగ్‌లో ఉండడం పాలకులు, అధికారుల చిత్తశుద్ధి స్పష్టమైంది. నగర పరిధిలో 97 పనులను రూ.603.87 కోట్లతో పూర్తి చేశామని, 11 ప్రాజెక్టులకు సంబంధించి రూ.327 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయని రికార్డులు వెల్లడిస్తున్నాయి. కానీ, బల్దియా ఇంజనీరింగ్, స్మార్ట్‌సిటీ అధికారులు మాత్రం కేవలం రూ.15 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు, 10 పనులు పురోగతిలో ఉన్నాయని చెబుతుండడం గమనార్హం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఇలా..
స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులను ఐదేళ్ల గడువులోగా పూర్తి చేయాలి. అందుకు కేంద్రం రూ.500 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు ఏడాదికి ఒకమారు నిధులు మంజూరు చేయాలి. కానీ, ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.346 కోట్లు నిధులు, రాష్ట్ర ప్రభుత్వం రూ.403 కోట్ల నిధులు విడుదల చేశాయి. మిగిలిన నిధులపై ఆశలు లేనట్టే. కొన్ని స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులను పరిశీలిస్తే నత్తతో పోటీ పడుతున్నట్లు చెప్పవచ్చు. నవ్వితే నాంకేటి అన్నట్లు స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు సభ్యులు, ఇంజనీర్లు వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి.
పురోగతిలో ఉన్న స్మార్ట్‌సిటీ పనులు
భద్రకాళి బండ్‌కు రూ.84.20 కోట్లు కేటాయించగా అందులో 80 శాతం పనులు పూర్తయ్యాయి.
వడ్డేపల్లి బండ్ అభివృద్ధికి రూ.34.05 కోట్లు కేటాయించగా అందులో 60 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.
భద్రకాళి నాలా చెరువు నుంచి అలంకార్ జంక్షన్ వరకు నాలా విస్తరణ, అభివృద్ధికి రూ.84.20 కోట్లతో ప్రతిపాదించగా కేవలం 70 శాతం పనులు పూర్తయ్యాయి.
నగరం నలువైపులా గ్రాండ్ ఎంట్రెన్స్‌లు, అండర్ రైల్వే గేట్‌లోని దసరా రోడ్డు, కరీమాబాద్ రోడ్డు, వరంగల్ తూర్పులోని ప్రధాన రహదారిలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
గ్రేటర్ వరంగల్‌లో పురోగతిలో ఉన్న పనుల నిలిపివేత
నగరంలో కానరాని నూతన ఆవిష్కరణలు
పాలకవర్గం, అధికార యంత్రాగం నిర్లక్ష్యమేనన్న విమర్శలు
వరంగల్ స్మార్ట్‌సిటీ పథకం డిసెంబర్ 31తో ముగిసింది. ప్రభుత్వం గత ఏడాది మార్చిలో ఈ పథకాన్ని నిలిపేసి, పురోగతిలో ఉన్న పనులు చేపట్టాలని ఆదేశించింది. మరో 10 ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రభుత్వాల నుంచి రూ.15 కోట్లు రావాల్సి ఉంది.
– సత్యనారాయణ, ఎస్‌ఈ, గ్రేటర్ వరంగల్
గత డిసెంబర్ 31తో ముగిసిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల గడ
గత డిసెంబర్ 31తో ముగిసిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల గడ


