రేపు వైకుంఠ ఏకాదశి
● వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం
● ఊకల్‌లో శ్రీరంగనాథుడిగా నాగసుబ్రహ్మణ్యుడి దర్శనం
గీసుకొండ: జిల్లాలోని పలు వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం దేవతామూర్తులను ఉత్తర ద్వార దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గీసుకొండ మండలంలోని ఊకల్ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు ఆదివారం తెలిపారు. విష్ణుమూర్తి మేనల్లుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఈ ఆలయంలో శ్రీరంగనాథుడిగా భక్తులకు దర్శనం ఇస్తాడన్నారు. ఉత్తర ద్వార దర్శనంతో సర్వపాపాలు తొలుగుతాయన్నారు. గర్భాలయంలో శేషపాన్పు (సర్పం)పై పడుకుని నిద్రిస్తున్నట్లు భక్తులకు దర్శనం ఇస్తాడన్నారు. దీనికి సంబంధించిన విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి ఆలయంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకోవాలన్నారు.


