
ట్రాన్స్‌జెండర్లు ఆత్మగౌరవంతో జీవించాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ట్రాన్స్‌జెండర్లు ఆత్మగౌరవంతో జీవించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ సమావేశపు హాల్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి గురువారం నిర్వహించిన ట్రాన్స్‌జెండర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆధార్‌కార్డు లేనివారికి కార్డులు ఇవ్వాలని, కార్డులో పేరు, జెండర్ మార్పునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారందరికీ గుర్తింపుకార్డులు, రేషన్‌కార్డులు అందజేస్తామని తెలిపారు. కార్మికశాఖ ద్వారా లేబర్‌కార్డులు, దివ్యాంగ ట్రాన్స్‌జెండర్లకు పింఛన్లు మంజూరు చేస్తామని వివరించారు. ఎంజీఎం ఆస్పత్రిలో వారంలో ఒకసారి ప్రత్యేక ఓపీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. స్వశక్తి మహిళా తరహాలో సంఘాలుగా ఏర్పడితే వ్యాపార యూనిట్లకు రుణాలు అందిస్తామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ, రాంరెడ్డి, డీడబ్ల్యూఓ రాజమణి, ట్రాన్స్‌జెండర్ల కమ్యూనిటీ అడ్వైజర్ ఈవీ శ్రీనివాస్‌రావు, ట్రాన్స్‌జెండర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి లైల, సభ్యులు అశ్విని రీమిష, పూర్ణిమారెడ్డి, నక్షత్ర త్రిపుర, శాస్త్రి, జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.
బోధనలో ప్రమాణాలు పెంచాలి
విద్యాబోధనలో ప్రమాణాలు పెంచేందుకు ఉపాధ్యాయులు చొరవచూపాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలని ఎంఈఓలను ఆదేశించారు. స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఎఫ్‌ఎల్‌ఎన్, ఎల్‌ఐపీలో భాగంగా బేస్‌లైన్ రిజల్ట్స్‌ను తెలంగాణ స్కుల్ యాప్‌లో ఆన్‌లైన్ చేయాలని, ఎఫ్‌ఏ–1 మార్కులను సీసీఈ వెబ్‌పోర్టల్‌లో వెంటనే అప్‌లో డ్ చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి రంగయ్యనాయుడు, సుజన్‌తేజ, అధికారులు పాల్గొన్నారు.