
రుద్రేశ్వరాలయంలో శ్రీమహాలక్ష్మీ యాగం
హన్మకొండ కల్చరల్: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఐదో రోజు ఆదివారం శ్రీమహాలక్ష్మీ యాగం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, ప్రణవ్, సందీప్‌శర్మ ఉదయం నుంచి స్వామివారికి రుద్రాభిషేకం, పూజలు నిర్వహించారు. మూల(ఉత్తిష్ట) మహాగణపతికి ప్రాచీన కోనేరు నీటితో గంగా జలాభిషేకం, నారికేళాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించి అనంతరం సర్పగణపతిగా అలంకరించారు. ఉత్సవ గణపతి విగ్రహానికి గణపతి సూక్త మంత్రపఠనంతో షోడశోపచారపూజలు, మహా నైవేద్యం, మహా హారతి జరిగాయి. పంచలోహ ఉత్సవమూర్తిని పద్మవాహనంపై ప్రతిష్ఠించి పల్లకీసేవ నిర్వహించారు. లోకకల్యాణార్థం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో గణపతి రుద్రహోమం, శ్రీమహాలక్ష్మీ హోమం నిర్వహించారు. వొడ్డె ప్రకాశ్ దంపతులు, కంజుల మహేశ్ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఈ సందర్భంగా గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లను వీడి ధార్మికభావాలతో ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. నృత్యగురువు తాడూరి రేణుక శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్యాలు అలరించాయి. ఈఓ అనిల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.