
టూరిజం స్పాట్‌గా ఉర్సుగుట్ట రంగసముద్రం
● ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
● సమీక్షలో కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: వరంగల్ నగరంలోని ఉర్సు రంగసముద్రం చెరువును టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మంగళవారం కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి, బల్దియా కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి తదితర అధికారులతో కలిసి ఉర్సుగుట్ట రంగ సముద్రం చెరువును పరిశీలించారు. నగర ప్రజలు సాయంత్రం వేళలో సేదతీరేందుకు చెరువుకు ఆనుకుని రోడ్డువైపు వాకింగ్ ట్రాక్, తదితర ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, బల్దియా కమిషనర్‌తో కలిసి వివిధశాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇన్నర్‌రింగ్ రోడ్డు, భూసేకరణ పురోగతి, గుండు చెరువు, నిర్వాసితులకు పరిహారం చెల్లింపు తదితర అంశాలపై సమీక్షించి సమర్థ నిర్వహణకు అధికారులకు దిశానిర్దేశనం చేశారు. అలాగే ఏకవీరదేవి దేవాలయంలో మిగిలిన అభివృద్ధి పనులు ఈనెల 27వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఇరిగేషన్ ఎస్‌ఈ రాంప్రసాద్, ఈఈ కిరణ్‌కుమార్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ స్వామి, జిల్లా ఉద్యానవన అధికారి శ్రీనివాస్‌రావు, గౌతమ్‌రెడ్డి, సత్యపాల్‌రెడ్డి, అజీత్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.