కోటను సందర్శించిన మాల్దీవ్స్‌ దేశస్తులు | - | Sakshi
Sakshi News home page

కోటను సందర్శించిన మాల్దీవ్స్‌ దేశస్తులు

May 29 2025 1:03 AM | Updated on May 30 2025 12:28 PM

ఖిలా వరంగల్‌: కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్‌ కోటను బుధవారం మాల్దీవ్స్‌ దేశస్తులు సందర్శించారు. నాలుగు కీర్తితోరణాల నడుమ నళ్ల రాతిలో నాటి శిల్పులు చెక్కిన శిల్పకళ సంపదను తిలకించారు. అనంతరం రాతి, మట్టికోట అందాలు, ఖుష్‌మహల్‌ను సందర్శించి కాకతీయుల కళాఖండాలను తమ వెంట తెచ్చుకున్న కెమెరాల్లో బంధించుకున్నారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను కోట గైడ్‌ రవి వివరించారు. వారివెంట కేంద్రపురావస్తుశాఖ కో–ఆర్డినేటర్‌ శ్రీకాంత్‌, టీఎస్‌టీడీసీ కోట ఇన్‌చార్జ్‌ అజయ్‌ పాల్గొన్నారు.

వరంగల్‌లో సీజీహెచ్‌ఎస్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ : ఎంపీ కావ్య

హన్మకొండ చౌరస్తా: త్వరలో వరంగల్‌లో సీజీహెచ్‌ఎస్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ ప్రారంభమవుతున్నట్లు వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెల్‌నెస్‌ సెంటర్‌కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు ఆ శాఖ అదనపు కార్యదర్శి రోలీసింగ్‌ లేఖ రాశారని పేర్కొన్నారు. అవసరమైన పోస్టుల భర్తీకి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌నుంచి ఆమోదం కూడా లభించినట్లు పేర్కొన్నారు. ఈ వెల్‌నెస్‌ సెంటర్‌ ద్వారా వైద్య చికిత్సలు, వ్యాధి నిర్ధారణ తదితర సదుపాయాలు కలుగుతాయని తెలిపారు. సీజీహెచ్‌ఎస్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటుకు కృషి చేసిన ఎంపీ కావ్యకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

క్రైం ఏసీపీగా సదయ్య

హసన్‌పర్తి: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ క్రైం ఏసీపీగా సదయ్య నియమితులయ్యారు. సీఐడీ విభాగంలో పనిచేసిన సదయ్య బదిలీపై ఇక్కడికిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. గతంలోని ఆత్మకూర్‌లో ఎస్సైగా, కేయూసీ, సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించారు.

నిట్‌లో టెమ్‌ ఎక్స్‌పో

కాజీపేట అర్బన్‌ : నిట్‌ వరంగల్‌లోని సీఆర్‌ఐఎఫ్‌ (సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్ట్రూమెంటేషన్‌ ఫెసిలిటీ) భవనంలో బుధవారం ఏర్పాటుచేసిన టెమ్‌ (ట్రాన్స్‌మిషన్‌ ఎలక్ట్రాన్‌ మైక్రోస్పోపీ) స్పెసిమెన్‌ ప్రిపరేషన్‌ పరికరాల ఎక్స్‌పోను నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ ప్రారంభించి మాట్లాడారు. నానో టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలకు వేదికగా ఎక్స్‌పో నిలవాలని ఆకాంక్షించారు. నిట్‌తోపాటు వివిధ విద్యాసంస్థల విద్యార్థులకు, పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు తోడ్పడుతుందన్నారు. కార్యక్రమంలో డీన్‌ అకాడమీ శరత్‌బాబు, ప్రొఫెసర్‌ శ్రీలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.

కాజీపేట రైల్వే అమృత్‌ భారత్‌ పనుల తనిఖీ

కాజీపేట రూరల్‌: కాజీపేట జంక్షన్‌లో జరుగుతున్న అమృత్‌ భారత్‌ రైల్వే పునరాభివృద్ధి పనులను బుధవారం సికింద్రాబాద్‌ డివిజన్‌ అడిషనల్‌ రైల్వే మేనేజర్‌ (ఏడీఆర్‌ఎం) గోపాల్‌ తనిఖీ చేశారు. స్థానిక రైల్వే అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న కాజీపేట రైల్వే రన్నింగ్‌ రూం కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అక్కడి నుంచి రైల్వే డిజిల్‌ లోకోషెడ్‌కు వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను తనిఖీ చేసి షెడ్‌ అధికారులతో మాట్లాడారు. ఆయనవెంట సికింద్రాబాద్‌ డివిజన్‌ ఏడీఈన్‌ ప్రంజల్‌ కేసరి, కాజీపేట ఏడీఈఎన్‌ కేఆర్‌కె.రాజు, ఐఓడబ్ల్యూ విజయ్‌కుమార్‌, వివిధ విభాగాల స్థానిక అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement