ప్రత్యేక అలంకరణలో సిద్ధేశ్వరుడు
నర్సంపేట రూరల్: ప్రత్యేక అలంకరణలో సిద్ధేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చాడు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని సిద్ధేశ్వర ఆలయంలో స్వామివారిని అర్చకులు భిక్షమయ్యశాస్త్రి, సాయిశాస్త్రి, గణేశ్‌శాస్త్రి ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
పాకాల తైబందీ ఖరారు
నర్సంపేట: ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు ఆయకట్టు రబీ తైబందీని నీటి పారుదలశాఖ అధికారులు, రైతుల సమక్షంలో బుధవారం ఖరారు చేసినట్లు ఈఈ సుదర్శన్‌రావు తెలిపారు. పాకాలలో ప్రస్తుతం 28.6 ఫీట్ల నీటిమట్టం ఉందని పేర్కొన్నారు. సంగెం కాల్వ కింద 10 వేల ఎకరాలు, జాలుబంధం కాల్వ కింద 3,515, తుంగబంధం కాల్వ కింద 1,100 ఎకరాలు(లంబాడీ లచ్చమ్మ బుర్ర వరకు), పసునూరి కాల్వ కింద 1457, మాటు వీరారం కింద 900 ఎకరాలు నిర్ణయించారు. పాకాల ఆయకట్టు కింద మొత్తం 18,193 ఎకరాలకు 16,972 ఎకరాలకు నీరు అందించనున్నట్లు ఈఈ సుదర్శన్‌రావు పేర్కొన్నారు జనవరి మొదటి వారంలో నీటిని విడుదల చేస్తామని, మొదటి వారంలోనే నార్లు పోసుకుని ఏప్రిల్ 30 లోపు కోతలు పూర్తిచేసుకునే విధంగా రైతులు సన్నద్ధం కావాలని ఆయన సూచించారు.
మాదన్నపేట చెరువు 1,020 ఎకరాలు..
నర్సంపేట రూరల్: మాదన్నపేట పెద్ద చెరువు యాసంగి తైబందీ రైతుల సమక్షంలో ఖరారు చేసినట్లు డీఈ సామ్యానాయక్ తెలిపారు. ఈ మేరకు నర్సంపేట నీటి పారుదల శాఖ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ సామ్యానాయక్ మాట్లాడుతూ మాదన్నపేట చెరువు మొదటి నుంచి చిమ్మినేని బుర్ర వరకు (మాదన్నపేట శివారు) 220 ఎకరాలు, వైఎస్‌ఆర్ రోడ్డు నుంచి గొల్లె కన్నయ్య వరకు 500 ఎకరాలు, దుబ్బ కాల్వ చెరువు మొదటి నుంచి కుమ్మరిగడ్డ బుర్ర వరకు 300 ఎకరాలు మొత్తం 1,020 ఎకరాలకు తైబందీ ఖరారు చేసినట్లు తెలిపారు. ఏఈ నితిన్, రైతులు పాల్గొన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
ఖిలా వరంగల్: మహిళలు వ్యాపారరంగాల్లో ఆర్థికంగా ఎదగాలని తెలంగాణ రాష్ట్ర నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ బి.ఉదయ్ భాస్కర్ సూచించారు. మహిళా స్వయం సహాయ సంఘం సభ్యులకు నైపుణ్యత, సూక్ష్మ వ్యాపారాల ప్రోత్సాహం(ఎం–సువిధ)పై వరంగల్ శంభునిపేటలోని ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ నాబార్డ్ ఎప్పటికప్పుడు మహిళల నైపుణ్యాభివృద్ధికి తోడ్పాటునిస్తుందని, శిక్షణలతోపాటు నాణ్యమైన ఉత్పత్తులు, మార్కెటింగ్ పద్ధతులు కూడా మహిళలకు నేర్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళలు ఆన్‌లైన్, డిజిటల్ మార్కెటింగ్‌లో శిక్షణ పొందాలని, అంతర్జాతీయ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ మహిళలు శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాబార్డ్ వరంగల్ అభివృద్ధి మేనేజర్ శ్రీ చైతన్య రవి, డీజీఎం బొల్లా శ్రీనివాస్, ఏజీఎం చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా పరిశ్రమల అధికారి నరసింహమూర్తి, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, కార్పొరేటర్ పోశాల పద్మ, గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్ చైతన్యకుమార్, యూనియన్ బ్యాంకు డీజీఎం కమలాకర్, చింతల అన్వేశ్ పాల్గొన్నారు.
ప్రత్యేక అలంకరణలో సిద్ధేశ్వరుడు
ప్రత్యేక అలంకరణలో సిద్ధేశ్వరుడు


