ఈసారి పెద్ద చెరువుల్లోనే!
చేపపిల్లలను విడుదల చేసిన మత్స్యశాఖ అధికారులు
గీసుకొండ: జిల్లాలోని చెరువుల్లో ఉచిత చేపపిల్ల లను వదిలే కార్యక్రమం ప్రహసనంలా మారింది. చేపపిల్లలను పెద్ద చెరువుల్లో విడుదల చేసి చిన్న చెరువులకు పంపిణీ చేయలేని పరిస్థితి నెలకొంది. సెప్టెంబర్, అక్టోబర్‌లోపు ప్రతి ఏడాది చేపపిల్లలను పంపిణీ చేయాల్సి ఉండగా.. గ్రామపంచాయతీ ఎన్నికలు రావడంతో మరింత జాప్యమైంది. ఎట్టకేలకు ఈ ఏడాది నవంబర్‌లో పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 71 పెద్ద (పెరినియల్) చెరువులు ఉండగా ఇప్పటి వరకు 63 చెరువుల్లో సుమారు 71.43 లక్షల చేపపిల్లలు వదిలారు. ఇంకా మిగిలిన పెద్ద చెరువుల్లో 18.82 లక్షల చేపపిల్లలను పోయాల్సి ఉందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. 635 చిన్న (సీజనల్) చెరువుల్లో ఒక్క చెరువులో కూడా చేపపిల్లలను పోయలేదని చెబుతున్నారు. ఈఏడాది చేపపిల్లల పంపిణీ టెండర్‌ను పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన జస్వంత్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ వారు దక్కించుకున్నారు. చాలా ఆసల్యంగా టెండర్ల ప్రక్రియ ముగియడం, పంపిణీలో జాప్యం కావడంతో చిన్న చెరువులకు చేపపిల్లలను అందించలేమని వారు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.
వాతావరణం అనుకూలించినా..
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. నవంబర్ మొదటి వారం వరకు వర్షాలు కురవడంతో చెరువులు మత్తడి పడ్డాయి. ఎన్నడూ లేని విధంగా చేపపిల్లల పంపిణీ ఆలస్యంగా ప్రారంభించడంతో తాము నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని మత్స్య సంఘాల నాయకులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది సగం మేరకు చేపపిల్లలను పంపిణీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని వారు ఆరోపిస్తున్నారు. అయితే, ఇప్పటికే ఈ ఏడాది మత్స్యసంఘాల వారు సొంత డబ్బులతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి చెరువుల్లో పోశారు. చిన్న చెరువులకు చేపపిల్లలను పంపిణీ చేయలేకపోయినా తమకు నగదు బదిలీ చేయాలని మత్స్య సంఘాల వారు కోరుతున్నారు.
నీలకంఠ రొయ్య పిల్లల పంపిణీ లేనట్లే..
జిల్లాలోని పలు జలాశయాల్లో కొంతకాలంగా మత్స్యకారులకు లాభదాయకంగా ఉండే నీలకంఠ రొయ్య పిల్లలను ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఏడాది కూడా పంపిణీ చేస్తారని అనుకుంటే వారికి నిరాశే మిగిలింది. గతంలో సంగెం మండలం ఎలుగూరు రంగంపేట చెరువు, రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్, వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట చెరువు, నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువు తదితర జలాశయాల్లో 10 లక్షల వరకు రొయ్యపిల్లలను పంపిణీ చేశారు. ఇవి మంచినీటి జలాశయాలు కావడంతో మత్స్యకారులు పెరిగిన రొయ్యలను వలలతో పట్టి అధిక ఆదాయం పొందేవారు. ఈ ఏడాది రొయ్య పిల్లల పంపిణీ ఉంటుందని అనుకున్నాం అదేం లేదని అధికారులు చెబుతున్నారు.
మత్స్య
సంఘాలు 189
రిజర్వాయర్ మైలారం
మొత్తం చెరువులు 706
మత్స్య
సంఘాల్లో
సభ్యులు
15,821
చిన్నచెరువులకు పంపిణీ చేయబోమని చెప్పిన జస్వంత్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్
ఇలాగైతే తీవ్రంగా నష్టపోతామంటున్న మత్స్య సంఘాల బాధ్యులు
జిల్లాలో 635 చిన్న, 71 పెద్దచెరువులు.. 1.93 కోట్ల చేపపిల్లల పంపిణీ లక్ష్యం
రాష్ట్ర అధికారులకు నివేదించాం
చిన్న చెరువులకు చేపపిల్లలను పంపిణీ చేయలేమని జస్వంత ఆక్వా కంపెనీ వారు చెప్పారు. ఈ విషయాన్ని తాము రాష్ట్ర మత్స్యశాఖ అధికారులకు ఇప్పటికే నివేదించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుకు సాగుతాం. జిల్లాలో ఇంకా చేపపిల్లలను పంపిణీ చేయని పెద్ద జలాశయాలకు ఈ నెల 31లోపు పంపిణీ పూర్తి చేస్తాం.
– పిల్లి శ్రీపతిరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి
ఈసారి పెద్ద చెరువుల్లోనే!


