మద్దిమేడారం జాతరకు ఏర్పాట్లు చేయాలి
● అధికారుల సమీక్షలో కలెక్టర్ సత్యశారద
నల్లబెల్లి: అధికారులు సమన్వయంతో పనిచేసి నాగరాజుపల్లి మద్దిమేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. అధికారులతో కలిసి మద్దిమేడారం జాతరను కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఆలయ ప్రధాన పూజారి దురిశెట్టి నాగరాజు స్వాగతం పలికారు. తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జనవరి 28, 29, 30, 31 తేదీల్లో జరగనున్న జాతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రోడ్ల మరమ్మతు, విద్యుత్ సరఫరా, లైట్ల ఏర్పాటు, తాగునీటి వసతి, పారిశుద్ధ్య పనులు, వాహనాల పార్కింగ్‌కు స్థలాల కేటాయింపు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రధాన పూజారి దురిశెట్టి నాగరాజుతో మాట్లాడి జాతర ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లపై సమగ్ర నివేదిక పంపించాలని తహసీల్దార్ ముప్పు కృష్ణను ఆదేశించారు. జాతరలో ప్లాస్టిక్‌ను వినియోగించొద్దని, పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ భక్తులను కోరారు. పీఆర్ జిల్లా అధికారి ఇజ్జగిరి, ఎంపీడీఓ డాక్టర్ శుభనివాస్, సర్పంచ్‌లు ఎరుకలి లలిత, ఎరుకల సరోజన, ఆలయ కమిటీ చైర్మన్ గాదె సుదర్శన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు సుధాకర్, విష్ణు పాల్గొన్నారు.
మేడారం భక్తులకు
వసతులు కల్పించాలి..
న్యూశాయంపేట: ములుగు జిల్లా మేడారం జాతరకు వెళ్లే సమక్క–సారలమ్మ భక్తులకు వసతులు కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాట్లపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికతో సమర్థవంతంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం భక్తుల కోసం తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటును క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా ఆర్‌అండ్‌బీ అధికారి రాజేందర్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు, ఈఈ సునీత తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాలను నివారించాలి..
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్‌స్పాట్లు) గుర్తించి నివారించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలన్నారు. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి, ఇతర ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఈఈ రాజేందర్, జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి శోభన్‌బాబు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి ఇజ్జగిరి, ఎన్‌హెచ్ అధికారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మద్దిమేడారం జాతరకు ఏర్పాట్లు చేయాలి


