మీచేతుల్లోనే పంచాయతీ సమాచారం
సాక్షి, వరంగల్: మీ ఊరిలో చెత్త సమస్య ఉందా.. రాత్రి వేళ వీధి దీపాలు వెలగడం లేదా.. డ్రెయినేజీ నిండిపోయిందా.. అయినా పంచాయతీ సిబ్బంది ఎవరూ పట్టించుకోవడం లేదా.. ఇన్నాళ్లూ సమస్యలు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్తేనే పరిష్కారం అవుతాయనే అపోహ ఉండేది. ఇప్పుడు మీరే ఆ సమస్య పరిష్కరించవచ్చు. అందుకే మీరు చేయాల్సిందల్లా మీ సెల్‌ఫోన్‌లో ఆ సమస్య తీవ్రతను తెలిపే ఫొటో తీసి ‘మేరీ పంచాయతీ’ యాప్‌లో కంప్లయింట్ సిస్టం అనే ఫీచర్‌లో జియో ట్యాగ్ వివరాలతో నిక్షిప్తం చేస్తే చాలు.. ఆ సమస్యను అక్కడున్న పంచాయతీ సిబ్బంది పరిష్కరిస్తారు. లేదంటే ఉన్నతాధికారులు ఇలా వచ్చే ఫిర్యాదులను పట్టించుకోని సిబ్బందిపై వేటు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. గ్రామాల్లో పాలన పారదర్శకత కోసం 2019లోనే కేంద్రం ఈ మేరీ పంచాయతీ యాప్ తీసుకొచ్చింది. ఇటీవల నుంచే పూర్తిస్థాయిలో యాప్ పనిచేస్తోంది. ఆయా పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, పంచాయతీల ఆదాయం, ఖర్చు వివరాలను అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ యాప్‌లో వివరాల నమోదు సమయంలోనే జీపీఎస్ ద్వారా గుర్తించే అవకాశముంది. ఇతర చోట్ల పనులకు కేటాయించిన నిధులను వినియోగించినా తెలుసుకోవచ్చు. ఇలా చేయడంతో పాలకులు సైతం తప్పులు చేయడానికి అవకాశం ఉండదు. అధికారులు తప్పుడు నివేదికలు రూపొందిస్తే ప్రశ్నించడానికి వీలుంటుంది. అయితే ఈ యాప్‌పై ప్రజలకు అవగాహన కలిగించడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. గ్రామాల్లో చాలా వరకు చదువుకున్న యువతకు తప్ప మరొకరికి ఈ యాప్ ఉన్నట్లు తెలియదు. ఈ యాప్‌పై పంచాయతీ అధికారులు జాగృతి కల్పించాల్సిన అవసరముంది. ఇటీవల జిల్లాలో 316 పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు.
మీ ఊరి చిట్టా మీ చేతుల్లోనే..
మేరీ పంచాయతీ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ప్లే స్టోర్‌కు వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ కావాలి. వెంటనే ఆర్థిక సంవత్సరం, రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయతీ వివరాలు, పిన్‌కోడ్ ఎంచుకోవాలి. అనంతరం గ్రామపంచాయతీ పూర్తి వివరాలు ఇందులో కనిపిస్తాయి. ఈ యాప్ ద్వారా సర్పంచ్, కార్యదర్శి, గ్రామ కమిటీలు, పంచాయతీ ఆస్తుల వివరాలు తెలుసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ సంవత్సరం మంజూరు చేసే నిధులు, పనులు ఏ దశలో ఉన్నాయి, దేనికి ఎంత ఖర్చు చేశారన్న వివరాలు నమోదై ఉంటాయి. నిధుల్లో సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులు కూడా యాప్‌లో నమోదు చేస్తారు. వచ్చే సంవత్సరంలో అంచనా వ్యయాల నమోదుతోపాటు గ్రామసభల వివరాలు సైతం అందుబాటులో ఉంటాయి. దీనిలో నిధుల వినియోగంలో ఎన్ని లోపాలున్నా, అక్రమాలు జరిగినా తెలుసుకోవడమే కాకుండా సంబంధిత అధికారులను ప్రశ్నించడానికి అవకాశం ఉంది. ఊరు వదిలి ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం తమ ఊరిలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుందని పంచాయతీ సిబ్బంది అంటున్నారు. ఇలా పంచాయతీ పాలనను ఎక్కడినుంచైనా తెలుసుకోవచ్చు.
అందుబాటులో ‘మేరీ పంచాయతీ’ యాప్
ఫొటో తీసి అప్‌లోడ్ చేస్తే సమస్య పరిష్కారం
గడువులోగా సిబ్బంది పరిష్కరించకపోతే చర్యలు
జిల్లాలో 316 గ్రామపంచాయతీలు


