యూరియా కోసం రైతుల పడిగాపులు
● అమల్లోకి రాని మొబైల్ యాప్
దుగ్గొండి/గీసుకొండ: యాసంగిలో మొక్కజొన్న, కూరగాయలు, ఇతర పంటలను సాగు చేస్తున్న రైతులకు యూరియా కోసం పడిగాపులు తప్పడం లేదు. ఎరువులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక మొబైల్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. యాప్‌పై ఇటీవల రైతులకు అవగాహన కల్పించారు. ఈ నెల 22 నుంచి మొబైల్ యాప్ ద్వారా బుక్‌చేసుకున్న రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. యాప్ అమల్లోకి రాకపోవడంతో రైతులు పాత పద్ధతిలోనే యూరియా కోసం బారులుతీరాల్సిన పరిస్థితి నెలకొంది. దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట పీఏసీఎస్ గోడౌన్‌కు యూరియా వచ్చిందని తెలుసుకున్న వందలాది మంది రైతులు బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి క్యూ కట్టారు. అనంతరం సొసైటీ సిబ్బంది ఒక్కో రైతుకు ఒక్కో బస్తా అందించారు. మధ్యాహ్నం వరకు తిండి తిప్పలు లేకుండా క్యూలో ఉంటే ఒకేబస్తా వచ్చిందని రైతులు నిట్టూర్చారు. అదేవిధంగా గీసుకొండ మండలం కొనాయమాకుల రైతు వేదిక వద్ద యూరియా బస్తాల కోసం రైతులు బారులుదీరి కనిపించారు.
యూరియా కోసం రైతుల పడిగాపులు


