● షాక్కు గురై రైతు మృతి
● కొండపర్తిలో ఘటన
ఐనవోలు: విద్యుత్ మోటారు ఆన్ చేస్తున్న క్రమంలో షాక్కు గురై ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కొండపర్తిలో చోటు చేసుకుంది. ఎస్సై పస్తం శ్రీనివాస్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాల్నె రమేశ్ (45) వ్యవసాయంతో పాటు కులవృత్తి (గౌడ) కల్లు తీస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజు మాదిరిగానే వరి పంటకు నీరు పారించడానికి మంగళవారం ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో స్టార్టర్ ద్వారా వ్యవసాయ మోటారు ఆన్ చేస్తుండగా ఎడమ చేతికి విద్యుత్ తీగ తగిలి షాక్కు గురై పక్కనే ఉన్న నీటి కాల్వలో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. చుట్టుపక్కల రైతులు గమనించి మృతుడి భార్య, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తన భర్త మృతి విషయంలో ఎవరిపై ఎలాంటి అనుమానం లేదని మృతుడి భార్య శోభారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.