
నాగారంలో జెండా గొడవ
పరకాల : మండలంలోని నాగారం గ్రామంలో బీజేపీ నాయకులు నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ వివాదానికి దారితీసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యావత్ దేశంలో ఎక్కడ జెండా ఎగురవేయకముందే నాగారంలో కొందరు బీజేపీ కార్యకర్తలు గ్రామ కూడలిలోని బీజేపీ జెండా గద్దైపె జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్‌రెడ్డి, బీజేపీ గద్దైపె జాతీయ జెండాను ఎలా ఎగురవేస్తారంటూ నిలదీశారు. దీంతో జాతీయ జెండాను తొలగించే క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య గొడవ చోటుచేసుకొని గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
బీజేపీ నాయకులపై దాడి సరికాదు..
నాగారంలో బీజేపీ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడడం సరికాదని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ పి.కాళీప్రసాద్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ దాడులు చేస్తే బీజేపీ కార్యకర్తలు భయపడకుండా చర్యకు ప్రతిచర్య ఉండడం ఖాయమన్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకుడు కట్కూరి దేవేందర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
బీజేపీ కార్యకర్తలపై
పోలీసులకు ఫిర్యాదు..
జాతీయ జెండాను అవమానపరుస్తూ బీజేపీ జెండా గద్దైపె త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతోపాటు జెండాను ధ్వంసం చేశారని ఐదుగురు బీజేపీ కార్యకర్తలపై గ్రామ కార్యదర్శి కురిమిళ్ల కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుండెబోయిన నర్సయ్య, కట్టగాని రాజయ్య, చిట్టిరెడ్డి మహేందర్‌రెడ్డి, వంగ భిక్షపతి, అడికెల సురేష్‌లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు.
బీజేపీ జెండా గద్దైపె త్రివర్ణ పతాకం ఆవిష్కరణ..కాంగ్రెస్ నేతల అడ్డగింత
దాడికి పాల్పడిన కాంగ్రెస్
నాయకులపై పోలీసులకు ఫిర్యాదు
బీజేపీ నాయకులపై గ్రామ కార్యదర్శి ఫిర్యాదు