
సైన్స్ కాంగ్రెస్‌ను సమర్థంగా నిర్వహించాలి
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 19, 20, 21వ తేదీల్లో తలపెట్టిన తెలంగాణ సైన్స్ కాంగ్రెస్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (టాస్) జనరల్ సెక్రటరీ, తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.సత్యనారాయణ కోరారు. శుక్రవారం కేయూ అకడమిక్ కమిటీ హాల్‌లో వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డితో కలిసి సైన్స్ కాంగ్రెస్ నిర్వహణపై మానిటరింగ్ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సత్యనారాయణ పాల్గొని పలు సూచనలు చేశారు. స్పీకర్లుగా వచ్చే ప్రముఖ సైంటిస్టులకు వసతి తదితర ఏర్పాట్లపై చర్చించారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ సీహెచ్.మోహన్‌రావు హైదరాబాద్‌నుంచి ఆన్‌లైన్‌లో పలు సూచనలు చేశారు. ఈసారి సదస్సులో ప్రధాన థీమ్‌గా సాధికారిత కోసం వినూత్న పుణ్యాలు–యువభారతాన్ని మార్చడంలో శాస్త్ర సాంకేతికత అనే అంశంపై చర్చించనున్నారు. మరో ఏడు సబ్ థీమ్స్‌లో వివిధ లైఫ్ సైన్స్‌స్ విభాగాల్లోను అధ్యాపకులు, పరిశోధకులు విద్యార్థుల పేపర్ల ప్రజెంటేషన్స్, పోస్టర్ల ప్రజెంటేషన్స్ ఉంటాయి. ప్రతి థీమ్‌లో బెస్ట్ పేపర్, పోస్టర్ ప్రజెంటేషన్‌లను ఎంపిక చేసి ప్రశంసపత్రాలు అందజేయాలని నిర్ణయించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం, తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.వెంకట్రామ్‌రెడ్డి, లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ ఎన్.ప్రసాద్, టెక్నికల్ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ పి.మల్లారెడ్డి, టి.మనోహర్, టాస్ వైస్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి, జాయింట్ సెక్రటరీ వడ్డె రవీందర్, సెషన్స్ కోఆర్డినేటర్ వరంగల్ నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
కేయూ వివేచన న్యూస్‌లెటర్ విడుదల
కాకతీయ యూనివర్సిటీ వివేచన న్యూస్‌లెటర్‌ను శుక్రవారం వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రంతో కలిసి విడుదల చేశారు. ఆరు నెలలుగా వర్సిటీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలతోపాటు ఆచార్యుల అవార్డులు, అచీవ్‌మెంట్స్, యూనివర్సిటీలో చేపట్టిన ప్రాంగణ నియామకాలు తదితర అంశాలను పొందుపర్చి వివేచన న్యూస్‌లెటర్‌గా విడుదల చేశారు.
టాస్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ సత్యనారాయణ
కేయూలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష