
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అల్పపీడన ప్రభావంతో జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, మహబూబాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, హనుమకొండ, పెద్దపల్లి, వరంగల్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశం ఉందని వెల్లడించింది.
While entire North TG is getting INSANE DOWNPOURS, the moderate to heavy rains to further cover Siddipet, Sangareddy, Medak in next 2hrs
Light to moderate rains to continue in Hanmakonda, Warangal, Mulugu, Jangaon, Yadadri, Vikarabad districts
Hyderabad - Steady drizzles or…— Telangana Weatherman (@balaji25_t) August 16, 2025
చెరువును తలపించిన హైదరాబాద్..
హైదరాబాద్ నగరంలోనూ రాత్రి కురిసిన వర్షానికి రోడ్లు చెరువులను తలపించాయి. కూకట్‌పల్లిలో చెట్లు విరిగిపడ్డాయి. సికింద్రాబాద్, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. హైడ్రా, జీహెచ్ఎంసీ, మాన్‌సూన్ సిబ్బంది రోడ్లపై నిలిచిన నీటిని తొలగించారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురవగా రోడ్లు జలమయమయ్యాయి. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. గాజులరామారంలో రోడ్లపై నిలిచిన నీటిని హైడ్రా సిబ్బంది క్లియర్ చేశారు. సూరారం జంక్షన్ వద్ద మోకాళ్ల లోతు వరద చేరి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో రోడ్డుపై చెట్టు ఒరిగింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
వరంగల్‌లో నిలిచిన రాకపోకలు..
కాగా, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీవర్షానికి వాగులు పొంగి రోడ్డుపై ప్రవహిస్తుండటంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో కురిసిన భారీ వర్షానికి వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని పెగడపల్లి, కేశపూర్ గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కాటారం-మేడారం రహదారిపై వాహనాల రాకపోకలు సాగడం లేదు. మేడారం సహా మండలంలోని 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
జలదిగ్బంధంలోనే ఏడుపాయల వన దుర్గమ్మ..
మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం మూడో రోజూ జలదిగ్బంధంలోనే ఉంది. దీంతో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అభిషేకం, విశేషాలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. సింగూర్‌లోని నక్క వాగు నుంచి వనదుర్గ ఆనకట్టకు 25 వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో వనదుర్గ ఆనకట్ట పొంగిపొర్లుతోంది. ఈక్రమంలో గర్భగుడి ముందు ఉన్న నదీపాయ రాజగోపురం నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వనదుర్గ ఆనకట్ట, ఆలయం వైపు భక్తులు ఎవరూ వెళ్లకుండా ఔట్‌పోస్ట్ సిబ్బంది బారికేడ్లు పెట్టి పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.