బంజారాల ఇతిహాసాన్ని వెలికితీసిన ప్రధాని
నర్సంపేట: బంజారాల ఇతిహాసాన్ని వెలికి తీసి, బంజారాల ఉనికిని ప్రధాని మోదీ ప్రపంచానికి చాటి చెప్పారని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ కొనియాడారు. పట్టణంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్రలోని వాశిం జిల్లా మనోర తాలూకా పౌరదేవి గ్రామంలో రూ.900 కోట్లతో సంత్ సద్గురు సేవాలాల్, దండి మేరామా (పౌరాదేవి) పేరుతో నిర్మించిన నంగారా భవన్‌ను ప్రధాని మోదీ ఈనెల 5న ప్రారంభించారని గుర్తుచేశారు. అందులో బంజారా సంస్కృతీసంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా మ్యూజియాన్ని ప్రారంభించారని తెలిపారు. ఎన్నో సంవత్సరాల కల నెరవేర్చిన దేశ ప్రధానమంత్రి మోదీకి బంజారా జాతి పక్షాన ధన్యవాదాలు తెలిపారు. భారతదేశంలో దాదాపు 12 కోట్ల మంది ఆదిమ బంజారాల వారసులు 21 రాష్ట్రాల్లో ఉన్నారని వెల్లడించారు. రాష్ట్ర జనాభాలో 10 శాతం ఉన్న గిరిజనుల జనాభాలో ఉన్న బంజారాలు 79 శాసన సభ నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ధారిస్తారని తెలిపారు. బంజారా భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలని, సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా దేశవ్యాప్తంగా నిర్వహించాలని కోరారు. సేవాలాల్ మహారాజ్ పేరుతో రాష్ట్రంలో ఆధ్యాత్మిక కేంద్రాన్ని నెలకొల్పాలని, శ్రీహతిరామ్ మఠానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. నర్సంపేటలోని వరంగల్ రోడ్డులో ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటానికి బుధవారం నిర్వహించే పాలాభిషేకానికి బంజారాలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, కాంటెస్ట్ అభ్యర్థి కంభంపాటి ప్రతాప్, నియోజకవర్గ కన్వీనర్ వడ్డేపల్లి నర్సింహారాములు, జిల్లా ఉపాధ్యక్షుడు రేసు శ్రీనివాస్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బానోత్ వీరన్న, రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల రాము పాల్గొన్నారు.


