
పరకాలలో ఘర్షణ పడుతున్న ఎమ్మెల్యే రేవూరి, కొండా మురళి వర్గీయులు (ఫైల్)
కలిసిన
చేతులు
సాక్షిప్రతినిధి, వరంగల్:
అధికార కాంగ్రెస్ పార్టీని అంతర్గత కలహాలు వీడడం లేదు. గ్రూపు రాజకీయాలకు కేరాఫ్‌గా ఉండే ఆ పార్టీలో వర్గపోరు చల్లారడం లేదు. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్.. ఈసారి అఽధికారంలో రావడంతో పార్టీలో చేరే కొత్తవారితో పాత కేడర్ మమేకం కాలేకపోతోంది. కష్టకాలంలో పార్టీలో కొనసాగిన నాయకులు, కార్యకర్తల మనోభావాలను ఎమ్మెల్యేలు పరిగణనలోకి తీసుకోకుండా ఇతర పార్టీల నుంచి పార్టీలో చేరిన వారికి పెద్దపీట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లతో సంబంధం లేకుండానే పార్టీలో చేర్చుకోవడం.. బీఆర్‌ఎస్, బీజేపీలో కొనసాగిన సమయంలో కాంగ్రెస్ పార్టీ కేడర్‌ను ఇబ్బంది పెట్టినవారిని చేర్చుకుని ప్రాధాన్యమివ్వడాన్ని జీర్ణించుకో లేకపోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వరంగల్, మహబూబాబాద్ నియోజకవర్గాల ప రిధిలో నిర్వహిస్తున్న సమన్వయ సమావేశాల్లో అంతర్గత కలహాలు, అసంతృప్తులు వెలుగు చూస్తుండ డం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
వీడని గ్రూపుల వార్... హైకమాండ్ ఆరా...
వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్‌ల పరిధిలో కాంగ్రెస్ నేతల మధ్య గ్రూపుల వార్ సాగుతోంది. పైకి అందరూ అందరితో బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. సందర్భం, అంశాలను బట్టి అది బయటకు వస్తోంది. వరంగల్ పార్లమెంట్ పరిధిలో మంత్రి కొండా సురేఖ, కొండా మురళీధర్‌లకు పరకాల ఎమ్మెల్యే, పార్లమెంట్ ఇన్‌చార్జ్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి మధ్య సఖ్యత లేదన్న చర్చ ఉంది. ఇటీవల జరిగిన సమన్వయ సమావేశంలో రెండు వర్గాల కార్యకర్తల గలాటే ఉదాహరణగా చెబు తున్నారు. వర్ధన్నపేటలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావు మధ్య గ్రూపు వార్ సాగుతుందన్న చర్చ కూడా ఉంది. కడియం శ్రీహరి, కావ్య పార్టీలో చేరకముందు పార్లమెంట్ టికెట్ ఆశించిన పలువురు పార్టీ ప్రచారానికి కలిసి రావడం లేదని చెబుతున్నారు. పాలకుర్తి, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో కొత్త, పాత కేడర్‌ల మనుషులు కలిసినా మనసులు కలవలేదన్న టాక్ వినిపిస్తోంది.
మహబూబాబాద్.. గిరిజనులకు రిజర్వు చేసిన నియోజకవర్గం. పూర్తిగా గిరిజన నేతలకు ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఈ పార్లమెంట్ పరిధిలో నర్సంపేట మినహా తక్కిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వు చేసినవి. ఈ పార్లమెంట్ స్థానంలో అగ్రవర్ణాలకు చెందిన ముగ్గురు కీలక నేతలు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇద్దరు ప్రభుత్వం కీలక పదవుల్లో ఉండగా, ఒకరు మాజీ ఎంపీ కాగా.. ఎస్టీ సామాజికవర్గానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు దీన్ని జీర్ణించుకోవడం లేదు. ప్రజల చేత ఎన్నుకుని కీలకస్థానంలో ఉన్న తాము చీటికీ మాటికీ ఈ ముగ్గురి నేతల సూచనలను ఫాలో అయ్యే పరిస్థితిపై నొచ్చుకుంటున్నారన్న చర్చ సాగుతోంది. దీనంతటిపై పార్టీ హైకమాండ్ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో సత్ఫలితాలు రావాలంటే రెండు పార్లమెంట్‌ల పరిధిలో అగ్రనేతలు, ముఖ్యనేతలు, ఎమ్మెల్యేల మధ్య ఇంకా సమన్వయం అవసరమన్న చర్చ వచ్చినట్లు సమాచారం.
చాపకింది నీరులా అసంతృప్తి..
‘సమన్వయం’లో బట్టబయలు..
అధికారంలోకి రాగానే వలసలను ప్రోత్సహించడం పార్టీని నమ్ముకున్న కేడర్‌ను అసంతృప్తికి గురిచేస్తోంది. నిన్న మొన్నటి వరకు ప్రత్యర్థులుగా ఢీ అంటే ఢీ అని పోరాడిన తమను జంప్ జిలానీలతో కలిసి నడవాల్సి రావడాన్ని జీర్ణించుకోవడం లేదు. ఇటీవల జరిగిన స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, పాలకుర్తి, వర్ధన్నపేట తదితర నియోజకవర్గాల సమన్వయ సమావేశాల్లో కార్యకర్తలు తమ అభిప్రాయాలను వెల్లడించడంతో పాటు నిరసనలు, గలాటాకు దిగారు. వర్ధన్నపేటలో ఎమ్మెల్యే నాగరాజు గెలుపు కోసం సుమారు ఐదు నెలలు కష్ట పడి పనిచేశామని, అయినా తమను గుర్తించడం లేదని ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు ప్రత్యేకంగా సమావేశమై ప్రకటన విడుదల చేశారు. ఆ మరుసటి రోజే నాగరాజుకు అనుకూలంగా మరోవర్గం మాట్లాడుతూ ఇదంతా ఆయనను ఓడించాలని చూసిన ఓ వర్గం కుట్రగా ఆరోపించారు. మరోవైపు వరంగల్ తూర్పులో ఆధిపత్యపోరు సాగుతుండగా, పాలకుర్తి వివాదం గాంధీభవన్‌ను తాకింది. కొంతకాలంగా హనుమాండ్ల ఝాన్సీరెడ్డి విధానాలతో పొసగని పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ హైకమాండ్ వద్దకు వెళ్లారు. దేవరుప్పుల మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తిని తొలగించి నల్ల శ్రీరాములుకు బాధ్యతలు ఇవ్వడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి, కావ్య ఎంట్రీ సందర్భంగా ఏర్పడిన వివాదం సద్దుమణిగినట్లే కనిపిస్తున్నా.. ఇంకా చాపకిందినీరులా రగులుతోంది. హైకమాండ్ చొరవతో కడియం కావ్యకు మద్దతుగా సింగపురం ఇందిర కలిసిపోయినా.. ఇటీవల జరిగిన సమన్వయ సమావేశంలో పార్టీ నేతల మధ్యనే కార్యకర్తలు నిరసనలు, నిలదీతలకు దిగారు. ఇలా చాలాచోట్ల ఉన్న అసంతృప్తిని తొలగించాల్సిన అవసరం ఉందన్న చర్చ ఆ పార్టీవర్గాల్లో సాగుతోంది.
ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో పాత,
కొత్త నేతల మధ్య కుదరని సయోధ్య
రెండు పార్లమెంట్‌ల పరిధిలో ఇదే పరిస్థితి.. కనిపించని సమన్వయం
వలస నేతలతో కలిసిపోని కేడర్... గ్రూపులు వీడని నేతలు
సమన్వయ సమావేశాల్లో
బయటపడుతున్న వర్గపోరు